Pushpa 2: The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ది రూల్’ ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీనీ చూడటానికి ప్రేక్షకులు చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాను అన్నట్టుగా పుష్పరాజ్ థియేటర్లలో అదరగొడుతున్నాడు. కలెక్షన్ల పరంగా ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. అయితే మరోవైపు ఈ సినిమా విషయంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనలు కూడా దిగ్భ్రాంతికి గురిచేసాయి. ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2: The Rule) రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీకి సంబంధించి వెలుగులోకి వస్తున్న వరుస విషాద సంఘటనలు షాక్ అయ్యేలా చేస్తున్నాయి. తాజాగా ఓ 19 సంవత్సరాల యువకుడు ‘పుష్ప 2’ సినిమాని చూడటానికి వెళ్తూ ప్రాణాలు కోల్పోయాడు.
గురువారం ఉదయం దొడ్డబల్లాపూర్ సమీపంలోని బాశెట్టిహళ్లి వద్ద రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా, వేగంగా వస్తున్న రైలు ఢీకొని 19 ఏళ్ల ప్రవీణ్ తమాచలం మృతి చెందాడు. అతను సమీపంలోని థియేటర్ వద్ద ‘పుష్ప 2’ (Pushpa 2) చూసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. బెంగళూరులో ప్రవీణ్ అనే యువకుడు తన ఫ్రెండ్స్ తో కలిసి ‘పుష్ప 2’ మూవీని చూడటానికి 10 గంటల షో కోసం గాంధీనగర్‌లోని వైభవ్ థియేటర్‌కు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెళ్తూ ఉన్నప్పుడు సదరు యువకుడు రైల్వే ట్రాక్ ఎక్కడనీ, అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తోంది.
ఇతను బాశెట్టిహళ్లిలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. స్నేహితులతో కలసి ఉదయం 9 గంటల సమయంలో ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2: The Rule) సినిమా చూడటానికి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని చూసిన స్నేహితులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనితోపాటు ఇదివరకే హైదరాబాదులో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో తల్లి, కొడుకు తీవ్ర గాయాల పాలయ్యారు. తల్లి మరణించగా, కొడుకు కొనఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై భర్త ఫిర్యాదుతో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన అల్లు అర్జున్ బాధితులకు అండగా ఉంటానని మాటిచ్చారు. అక్కడ జరిగిన విషాదకర ఘటనకు సారీ చెప్తూ, అభిమానులు సినిమాలు చూడడానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరోవైపు అభిమానులు అత్యుత్సాహంతో నల్గొండలో ఒక థియేటర్లో నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఎవ్వరూ గాయాల పాలు కానప్పటికీ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రేక్షకులు. ఇక మరోవైపు ముంబైలోని ఓ థియేటర్లో వింత స్ప్రే కారణంగా దగ్గు, వాంతులు లాంటి అనారోగ్యం బారిన పడిన వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ విషయంలోనే ఇలా వరుసగా దిగ్భ్రాంతికి గురి చేసే వరుస సంఘటనలు జరుగుతుండడం గమనార్హం.