2024 December : కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టడానికి మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. 2024 సినిమా ఇండస్ట్రీలో ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. అంచనాలు లేకుండా రిలీజ్ అయిన పలు సినిమాలు అనూహ్య విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటే, మరికొన్ని భారీ సినిమాలు బొక్క బోర్లా పడ్డాయి. అయితే ఇయర్ ఎండ్ మంత్ డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ కావడానికి పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకే ఒక్క తెలుగు మూవీ ఉండడం విశేషం. మరి 2024 ఏడాదిలో చివరి నెల అయిన డిసెంబర్లో చివరి వారంలో థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఆ సినిమాలేంటో చూసేద్దాం పదండి.
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ (Srikakulam Sherlockholmes)
వెన్నెల కిషోర్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ రూపొందించిన ఈ సినిమాను వెన్నపూస రమణా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో అనన్య నాగళ్ళ, స్నేహ గుప్తా హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 25న ఈ మూవీని నిర్మాత వంశీ నందిపాటి రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా నటించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ ట్రైలర్ ను చూసాక ఈ మూవీ మేరీ అనే యువతి హత్య చుట్టూ తిరుగుతుందనే విషయం అర్థమైంది. అయితే ఆమె హత్యకు గల కారణాలు ఏంటి? డిటెక్టివ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఈ కేసును ఎలా ఛేదించాడు? అనే విషయాలను తెరపై చూడాల్సిందే. ఇక ఈనెల చివరి వారంలో రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ఇదొక్కటే తెలుగు మూవీ కావడం విశేషం.
బేబీ జాన్ (Baby John)
‘బేబీ జాన్’లో రీసెంట్ గా తన ప్రియుడితో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ కూడా ఇదే. ఈ సినిమాతో కీర్తి బాలీవుడ్ లో మొదటి అడుగు వెయ్యబోతోంది. వరుణ్ ధవన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు కాలీస్ దర్శకత్వం వహించారు. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ప్రియా అట్లీ, జ్యోతి దేశ్ పాండే సంయుక్తంగా నిర్మించారు. తమిళంలో హిట్ టాక్ తెచ్చుకున్న ‘తేరి’కి రీమేక్ గా ‘బేబీ జాన్’ రాబోతోంది. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది.
మ్యాక్స్ (Max The Movie)
కన్నడ స్టార్ సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మ్యాక్స్‘. సునీల్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. ఈ కన్నడ మూవీ డిసెంబర్ 27న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది.
బరోజ్ (Baroz)
మలయాళ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న త్రీడీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘బరోజ్’. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మెచ్చే విధంగా మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో ఈ మూవీని రూపొందించారు. ఈనెల 25న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది.