Tollywood Actors: పుష్ప 2 సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఏమో కానీ, సినిమా రిలీజ్ రోజు జరిగిన ఒక్క ఘటనతో టాలీవుడ్ కి ఆ సెగతాకుతోంది. సంధ్య థియేటర్ వద్దకు హీరో అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ వైద్యశాలలో చికిత్స పొందుతూ, ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటున్నాడు. ఈ దుర్ఘటనకు అసలు కారకుడు హీరో అల్లు అర్జున్ అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, టాలీవుడ్ హీరోలను ఉద్దేశించి కీలక కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గొప్పోల్లమని విర్రవీగే సినిమా హీరోలు, ఏనాడైనా గ్రామాలను వైద్యశాలలను దత్తత తీసుకొని కార్యక్రమాలు చేశారా అంటూ సూటిగా ప్రశ్నించారు. గతంలో సీనియర్ నటులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజులు దివిసీమ ఉప్పెన సమయంలో జోల పట్టి విరాళాలు సేకరించారని ఈ సందర్భంగా వారి సేవను కొనియాడారు. అటువంటి మహానటులకు వారసులుగా వచ్చిన, ఇప్పటి కాలం హీరోలు ఏనాడైనా పేద ప్రజలకు సహాయపడిన దాఖలాలు లేవన్నారు.
ఖరీదైన వాచీలు, కార్లు వినియోగిస్తూ విదేశీ ట్రిప్పులతో నిరంతరం వార్తలో నిలవడం నేటితరం హీరోలకు అలవాటుగా మారిందని విమర్శించారు. తమిళ సినీ నటులకు ఉన్న సామాజిక స్పృహ కూడా తెలుగు నటులకు ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు బలిదానం చేసుకున్న రోజుల్లో, ఈ హీరోలంతా ఏమయ్యారని ఎమ్మెల్యే అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని, మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి పలు పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారన్నారు. నేటితరం హీరోలకు మాత్రం సేవా కార్యక్రమాలు అస్సలు పట్టడం లేదంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుత హీరోల కంటే విలన్ పాత్రలు పోషించే సోను సూద్ సేవా కార్యక్రమాలు నిర్వహించి, తన సేవా తత్పరతను చాటి చెప్పారని కొనియాడారు. హీరోయిన్ సమంత కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు ఎమ్మెల్యే.
Also Read: Deepa Dasmunsi: అల్లు అర్జున్ మామతో భేటీకి నో చెప్పిన మున్షీ.. కారణం అదేనా!
ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ప్రస్తుత హీరోలు మారాలని, నైజాం ఏరియా సినిమాలు చూడకుంటే అడుక్కొని తినడం ఖాయం అంటూ ఎమ్మెల్యే చెప్పారు. తెలంగాణకు చెందిన ఎంతమందికి ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఇచ్చారో చెప్పాలంటూ టాలీవుడ్ ను ఆయన ప్రశ్నించారు. మరి ఎమ్మెల్యే మాటలకు టాలీవుడ్ నుండి సమాధానం వస్తుందా, లేక సైలెంట్ గా ఉంటారా అన్నది తేలాల్సి ఉంది