Sharwa 38 : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ హీరో ఖాతాలో హిట్టు పడి చాలా కాలమే అవుతుంది. అయినప్పటికీ శర్వానంద్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ, రిజల్ట్ మాత్రం ప్రేక్షకులకే వదిలేస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్ లైనప్ లో రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే శర్వానంద్ 37వ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా శర్వానంద్ 38 (Sharwa 38)వ సినిమాకు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది.
శర్వానంద్ 38 అప్డేట్
శర్వానంద్ 38వ (Sharwa 38) సినిమాను సంపత్ నంది దర్శకత్వంలో పట్టాలెక్కించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. హైదరాబాద్ శివార్లలో ఇప్పటికే ఈ సినిమా కోసం 15 ఎకరాల విస్తీర్ణంలో భారీ సెట్ ను నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నే నేతృత్వంలో 1960 కాలాన్ని ప్రతిబింబిస్తూ ఈ సెట్ ను తీర్చిదిద్దారు. ఇదే సెట్ లో సినిమాకు సంబంధించిన 60% షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఈ ఒక్క సెట్ కోసమే నిర్మాతలు దాదాపు 4 కోట్లను ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇక ‘శర్వా 38’ మూవీలో హీరోయిన్, విలన్ ఇప్పటికే ఫిక్స్ కాగా, త్వరలోనే ఈ వివరాల గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోందని సమాచారం. మొత్తానికి శర్మానం 38వ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్టుగా అర్థమవుతుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో శర్వానంద్ నటిస్తున్న ఈ మూవీ ఆయన ఎక్స్పెక్ట్ చేసిన హిట్టుని తెచ్చి పెడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
‘నారి నారి నడుమ మురారి’ ఫస్ట్ లుక్
శర్వానంద్ లీడ్ రోల్ పోషిస్తున్న ఆయన 37వ (Sharwa 37) సినిమా టైటిల్ ని సంక్రాంతి సందర్భంగా రివీల్ చేశారు. టైటిల్ మాత్రమే కాదు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. బాలయ్య, రామ్ చరణ్ కలిసి ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడం విశేషం. ‘నారి నారి నడుమ మురారి’ (Nari Nari Maduma Murari) అనే టైటిల్ ని ఈ సినిమాకి నిర్మాతలు ఫిక్స్ చేశారు. టైటిల్ కు తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ లో హీరో ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోతున్నట్టు చూపించారు. ఈ మూవీలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా… అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1990లో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఇదే టైటిల్ తో సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో వచ్చిన ‘నారి నారి నడుమ మురారి’ సినిమాలో శోభన, నీరోష బాలయ్య సరసన హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. మరి ఇప్పుడు శర్వానంద్ కి కూడా అలాంటి భారీ హిట్టు అవసరమే. మరి ఆ హిట్ ని శర్వానంద్ 37వ సినిమా ఇస్తుందా, లేదంటే 38వ సినిమా ఇస్తుందా అనేది చూడాలి.