Shambhala Teaser: నటుడు సాయికుమార్ నట వారసుడిగా ప్రేమ కావాలి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆది సాయికుమార్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఆది ఆ తర్వాత అంతటి విజయాన్ని అందుకోవడం కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా కూడా ఆదికి సరైన హిట్ దక్కింది లేదు. ఎప్పటినుంచో ఒక్క హిట్ కోసం ఆది ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అన్ని జోనర్స్ లో కూడా నటిస్తూ మెప్పిస్తున్నాడు.. కానీ, విజయం దగ్గరకు కూడా వెళ్లలేకపోతున్నాడు.
ఇక ఈ ఏడాది షణ్ముఖ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు ఆది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అనుకున్నారు.. కానీ, అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో అనే విషయం కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. అయితే బాక్సాఫీస్ వద్ద హిట్టు కొట్టే వరకు పట్టువదలని విక్రమార్కుడిలా ఆది ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. ఈసారి ఎలాగైనా హిట్టును దక్కించుకోవాలని ఈ హీరో ఒక వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముదుకు రానున్నాడు.
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా రవివర్మ, మధు, హర్షవర్ధన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పేలా చేసింది.
సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న శంబాల టీజర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ” విశ్వంలో అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సైన్సు కు సమాధానం దొరకనప్పుడు అది మూఢనమ్మకం అంటుంది.. అదే దొరికితే సైన్స్ గొప్పదనం అంటుంది” అంటూ బేస్ వాయిస్ తో మొదలైన ఈ టీజర్ చాలా ఉత్కంఠ గా సాగింది. ఆకాశం నుంచి ఒక ఉల్క ఒక చిన్న గ్రామంలో పడుతుంది వచ్చిన దగ్గర నుంచి ఊరిలో ప్రజలు మృత్యువాత పడుతూ ఉంటారు. ఎన్నో వినాశనాలు జరుగుతాయి. ఈ రక్కసి కీడును ఆపడానికి హీరో ఆ గ్రామంలోకి అడుగుపెడతాడు. హీరో వెళ్ళాక అక్కడి ప్రజలు అతడిని నమ్మరా.. ? అసలు ఆకాశం నుంచి కింద పడిన ఆ ఉల్క ఏంటి..? ఎందుకు ఆ గ్రామంలోని మనుషులు చనిపోతున్నారు..? హీరో ఆ గ్రామాన్ని కాపాడాడా..? అనేది కథగా తెలుస్తుంది.
ఈ మధ్యకాలంలో హర్రర్ నేపథ్యంలో వచ్చిన ప్రతి సినిమా మంచి హిట్ ను అందుకుంటుంది. ప్రస్తుతం ఆది కూడా హర్రర్ థ్రిల్లర్ నే నమ్ముకున్నాడు. టీజర్ ను బట్టి ఇదేదో మంచి కంటెంట్ తో రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతోనైనా ఆది ఒక మంచి హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.