Actor Prabhu:ప్రముఖ తమిళ నటుడు ప్రభు గణేషన్ (Prabhu Ganeshan) గురించి, ఆయన నటన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అయితే తాజాగా ఆయన చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్ లో బ్రెయిన్ అనూరిజం శస్త్ర చికిత్స చేయించుకొని తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ప్రభు పీఆర్వో చిన్నతంబి మీడియాతో మాట్లాడుతూ అసలు విషయం తెలియజేశారు. చిన్నతంబి మాట్లాడుతూ..” ప్రభు సార్ ఒక చిన్న శస్త్ర చికిత్స చేయించుకున్నారు. వెంటనే డిశ్చార్జ్ కూడా అయ్యారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారు. అంతా క్షేమంగా ఉన్నారు” అంటూ ఆయన వెల్లడించారు.ఈ విషయం తెలిసి ప్రభు అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.
బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న నటుడు..
అసలు విషయంలోకి వెళితే.. తాజాగా అందుతున్న మీడియా సమాచారం ప్రకారం.. ప్రభు గత కొంతకాలంగా జ్వరం, తలనొప్పి లక్షణాలతో మెడ్వే హార్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో చేరారట. ఆయన మెదడులో మధ్య మస్తిష్క ధమని విభజన వద్ద, అంతర్గత కరోటిడ్ ధమని యొక్క పై భాగంలో ఉబ్బి ఉన్నట్లు వైద్యులు గుర్తించారట. ఇది పెద్ద మెదడు భాగానికి రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళం అని, వెంటనే శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించడంతో.. వైద్యుల సలహా మేరకు ఆయన ఈ శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంటికి తిరిగి వచ్చిన ప్రభు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
ప్రభు సినిమా జీవితం..
ప్రభు సినిమా జీవిత విషయానికి వస్తే.. 1980, 90 లలో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటులలో ఒకరిగా పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా కోలీవుడ్లో “ఇలయ తిలగం”అనే బిరుదును కూడా అందుకున్నారు. కోలీవుడ్ కే పరిమితం కాకుండా తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలలో కూడా దాదాపు 220కి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈయన తమిళ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యారు. ముఖ్యంగా ప్రభాస్(Prabhas), ఎన్టీఆర్ (NTR)వంటి స్టార్ హీరోల సినిమాలలో వారికి తండ్రిగా కూడా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు గడిచారు ప్రభు.
శివాజీ గణేషన్ కుమారుడే ప్రభు..
ప్రభు ఎవరో కాదు సీనియర్ స్టార్ హీరో శివాజీ గణేషన్(Shivaji Ganeshan)కుమారుడు. ఈయన కొడుకు విక్రమ్ ప్రభు (Vikram Prabhu) కూడా హీరోగా ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం తెలిసిందే. ‘ఏనుగు’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా విక్రమ్ ప్రభు పరిచయమయ్యాడు. ప్రస్తుతం అజిత్ హీరోగా నటిస్తున్న “గుడ్ బాడ్ అగ్లీ” సినిమాలో ప్రభు కనిపిస్తున్నారు. ఈ సినిమాకి ఆదిక్ రవిచంద్రన్ (Aadhik Ravichandran) దర్శకత్వం వహిస్తూ ఉండగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష కృష్ణన్, ప్రభు గణేషన్, ప్రసన్న , అర్జున్ దాస్, రాహుల్ దేవ్, సునీల్, యోగి బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.