Shiva Rajkumar :శాండల్‌వుడ్ హ్యాట్రిక్ హీరో శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) అమెరికాలో క్యాన్సర్ కు సంబంధించిన సర్జరీ చేయించుకుని విజయవంతంగా కోలుకున్నారు. తాజాగా ఆయన ఇండియాకు తిరిగి రాగా, అభిమానులు విమానాశ్రయం వద్ద శివన్నకు ఘన స్వాగతం పలికారు. అయితే శివన్న ఇంటికి వచ్చిన రెండవ రోజు అంటే ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి ఆయనకు స్వయంగా పరామర్శించారు.
క్యాన్సర్ ట్రీట్మెంట్ సక్సెస్ ఫుల్
కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) 2024 డిసెంబర్ 24న యునైటెడ్ స్టేట్స్‌లోని మియామీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (MCI)లో మూత్రాశయ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ తో క్యాన్సర్ ను జయించిన ఆయన జనవరి 26న బెంగళూరుకు తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే శివన్న చేయబోయే నెక్స్ట్ సినిమా టీమ్, అభిమానులు విమానాశ్రయం దగ్గరే ఆయనకు స్వాగతం పలికారు. ఈ 62 ఏళ్ల నటుడు అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుని, విదేశాల నుంచి తిరిగి వచ్చారనే వార్త తెలిసిన అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను పరామర్శించడానికి ఇంటికి క్యూ కడుతున్నారు.
శివన్నను పరామర్శించిన సీఎం
శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) అమెరికా నుంచి వచ్చిన 2వ రోజున సీఎం సిద్ధరామయ్య ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీశారు. సీఎంతో పాటు మంత్రి బైరతి సురేష్, న్యాయ సలహాదారు ఏఎస్ పొన్నన్న, ఎమ్మెల్యే భీమన్న నాయక్ కూడా ఉన్నారు. నాగవరలోని శివరాజ్ కుమార్ ఇంటికి వెళ్ళిన ముఖ్యమంత్రి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ శివన్నకు సర్జరీ జరిగిన వెంటనే ఫోన్ చేయగా, సర్జరీ సక్సెస్ అయ్యిందని చెప్పారని, ఇక ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
సర్జరీపై శివన్న స్పందన
తిరిగి వచ్చిన తరువాత శివన్న (Shiva Rajkumar) మీడియాతో మాట్లాడుతూ తనకు ట్రీట్మెంట్ టైమ్ లో భయమేసిందని అన్నారు. “నేను కొంచెం భయపడ్డాను. కానీ నా అభిమానులు, శ్రేయోభిలాషుల నుండి వచ్చిన సపోర్ట్ నాకు శక్తినిచ్చింది. ఆరు గంటల పాటు సర్జరీ జరిగింది. నేను రెండవ రోజు నడవడం ప్రారంభించాను. ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు. నేను మళ్లీ నటించి, నా అభిమానులను అలరించడానికి ఎదురు చూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆయనకు సర్జరీ జరిగినప్పుడు వెంట భార్య గీత, కుమార్తె నివేదిత ఉన్నారు. అయితే విదేశాల్లో ఉన్నప్పుడే ఆయన సర్జరీ సక్సెస్ ఫుల్ గా జరిగింది అంటూ ఓ వీడియో ద్వారా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
శివన్న చివరి సినిమా
శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) చివరిసారిగా కన్నడ చిత్రం ‘భైరతి రణగల్’లో కనిపించారు. ఈ మూవీ 2024 నవంబర్ 15న విడుదలైంది. ఆయన ఇప్పటికే ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే రామ్ చరణ్ RC 16లో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.