Waqf Amendment Bill : ఇప్పటి వరకు విస్తృత అధికారాలతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న వక్ఫ్ బోర్డును(Waqf Board) సంస్కరించేందుకు సిద్ధమైన కేంద్రం.. వక్ఫ్ సవరణ బిల్లుతో ముందుకు వచ్చింది. తొలుత ఈ బిల్లును దేశ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యుల డిమాండ్ తో బిల్లును అధ్యయనం చేసి సవరణలు సూచించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) ముందుకు పంపించారు. సుదీర్ఘ విచారణ చేపట్టిన ఈ కమిటీ.. వక్ఫ్ సవరణ బిల్లుకు 14 సవరణలతో ఆమోదం తెలిపింది. దీంతో.. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు చర్చకు రానుంది. ఈ విషయాన్ని జేపీసీ కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ (Jagdambika Pal) వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా వేలాది ఎకరాలను తమవిగా చెప్పుకుంటూ.. కొన్నాళ్లుగా వివాదాస్పదంగా వ్యవహరిస్తోంది వక్ఫ్ బోర్డు. అలహాబాద్ హైకోర్టు (Alahabad High Court) స్థలాన్ని తనదిగా ప్రకటించింది. అనేక హిందూ ఆలయాలు, క్రైస్తవ సంఘాల భూములతో పాటు ఏళ్లుగా ఇతరుల ఆధీనంలోని ఆస్తుల్ని తనవిగా ప్రకటించుకుంటోంది. ఈ విషయమై దేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో.. వక్ఫ్ యాక్ట్ – 1954 (Waqf Act, 1954), వక్ఫ్ (సవరణ) చట్టం 1984 (Waqf (Amendment) Act, 1984) లలో కొన్ని కీలక మార్పులు చేసేందుకు నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో.. చట్ట సవరణలో మార్పుచేర్పులు సూచించాల్సిందిగా కోరుతూ.. సంయుక్త పార్లమెంటరీ సంఘానికి సిఫార్సు (Recommend) చేశారు. తాజాగా.. ఈ బిల్లుపై పలు దఫాలుగా సమావేశమైన కమిటీ ముందుకు మొత్తంగా 44 సవరణలు వచ్చాయి. వాటిలో 14 సవరణలకు జేపీసీ ఆమోదించింది. మరో 26 సవరణలను పక్కన పెట్టేంసింది. సభ్యులు సూచించిన సవరణలన్నింటిపై ఓటింగ్ నిర్వహించగా.. మెజారిటీ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారు. కాగా విపక్షాలు సూచించిన సవరణలను సమర్ధిస్తూ 10 ఓట్లు, వ్యతిరేకిస్తూ 16 ఓట్లు వచ్చాయి.. దాంతో అవి ఆమోదం పొందలేకపోయాయి.
ఈ బిల్లుకు సవరణలు సూచించే విషయమై కమిటీలోనూ వాదనలు, ప్రతివాదనలు జరిగాయి. ఇటీవల నిర్వహించిన సమావేశంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన 10 మంది విపక్ష ఎంపీలు నిరసనకు దిగడంతో.. వారందరినీ ఓ రోజుంతా సస్పెన్షన్ చేయాల్సి వచ్చింది. దాంతో.. సస్పెండైన ఎంపీలంతా నిరనసలకు దిగారు. కమిటీ ఛైర్మన్ జగదాంబికా పాల్ సరిగా వ్యవహరించడం లేదని, కావాలనే పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విపక్ష పార్టీల నేతలు మరోసారి కమిటీ తీరుపై విమర్శులు చేస్తున్నారు. కేవలం అధికార కూటమి నేతల మార్పులకే చోటు లభించడం, విపక్ష పార్టీల సభ్యుల మార్పులకు తిరస్కరణ ఎదురుకావడాన్ని తప్పుబడుతున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ జరగలేదని ఆరోపించిన ఎంపీలు.. కమిటీ ఛైర్మన్ తమ వాదనలు వినలేదని, ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఆరోపిస్తున్నారు.
Also Read : రాష్ట్రానికి రెండో రాజధానిని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి.. పరిపాలన ఎక్కడి నుంచంటే..
అయితే ఈ ఆరోపణలను వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన జేపీసీ ఛైర్మన్ జగదాంబికా పాల్ తోసిపుచ్చారు. తనకు అప్పగించిన బాధ్యతల్ని సజావుగానే నిర్వహించానని, అంతా ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగిందని అన్నారు. విపక్ష సభ్యులు చెబుతున్న దాంట్లో నిజం లేదన్నారు. అంతా నిబంధనల మేరకే నడుచుకున్నానని, కమిటీలో ఓటింగ్ నిర్వహించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.