తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కస్తూరి ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ వేయగా కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించగా కస్తూరీ ఆచూకీ హైదరాబాద్ లో లభ్యమైంది. పోలీసులు కస్తూరిని ప్రస్తుతం చెన్నై తరలిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా కస్తూరి ఈ నెల 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమిళ రాజులకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగువారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
300 సంవత్సరాల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ప్రస్తుతం తమది తమిళ జాతి అంటున్నారని చెప్పారు. ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదు అని చెప్పేందుకు మీరు ఎవరు అంటూ ద్రవిడ సిద్దాంత వాదులపై కస్తూరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇతరుల ఆస్తులను లూటీ చేయవద్దని, ఇతరుల భార్యలపై మోజు పడవద్దని, ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెప్పడం వల్లనే తమిళనాట వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని విమర్శలు చేశారు. కస్తూరి చేసిన ఈ కామెంట్లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తన వ్యాఖ్యలపై కస్తూరి సైతం క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ కస్తూరీపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అవ్వడంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్దం అయ్యారు. ఆమె ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ నిరాకరించడంతో చివరికి నేడు పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు.