Aishwarya Rajesh:తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh).. ‘రాంబంటు’ అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. అలా తెలుగులో పలు చిత్రాలలో నటించిన ఈ అమ్మడు.. తమిళంలో హీరోయిన్ గా నటించి భారీ పాపులారిటీ అందుకుంది. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్లో ప్రయత్నం చేసి స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ఇక తర్వాత మళ్లీ రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) తో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా చేసి అబ్బురపరిచిన ఐశ్వర్య రాజేష్.. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్, టక్ జగదీష్ వంటి చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. ఇక ఈ ఏడాది వెంకటేష్ (Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేష్ భార్యగా భాగ్యం పాత్రలో నటించి అబ్బురపరిచింది. ఇకపోతే ఐశ్వర్య రాజేష్ కెరియర్ పరంగా సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నా.. ఫ్యామిలీ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
చేతికొచ్చిన బిడ్డల మరణంపై ఐశ్వర్య రాజేష్ తల్లి ఎమోషనల్..
ఐశ్వర్య రాజేష్ తండ్రి హీరో రాజేష్ (Rajesh) తల్లి నాగమణి (Nagamani) ఇద్దరు నటీనటులన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు సంతానం. అందులో ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ మరణించిన కొంత కాలానికే ఇద్దరు కొడుకులు.. పెళ్లీడుకొచ్చిన తర్వాత మరణించడంతో ఆ తల్లి ఎన్ని కష్టాలు పడిందో వర్ణనాతీతం. ప్రస్తుతం కూతురు సక్సెస్ చూసి సంతోష పడిన తల్లి నాగమణి ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తాము తమ జీవితంలో పడిన కష్టాల గురించి చెప్పుకొని బాధపడింది. ఈ క్రమంలోనే తమ పెద్ద కొడుకు మరణం ఇప్పటికీ మిస్టరీనే అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది నాగమణి.
ప్రేమించిన అమ్మాయి ఇంట్లోనే సూసైడ్..
ఇంటర్వ్యూలో భాగంగా.. మీ పెద్దబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయారు అని, ఒక అమ్మాయిని ప్రేమించడం వల్లే ఆ అమ్మాయి తరఫు వాళ్ళు చంపించారు అనే విషయం ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటుంది కదా.. దీనిపైన మీ స్పందన ఏమిటి అని ప్రశ్నించగా.. నాగమణి మాట్లాడుతూ.. “ఒకరకంగా చెప్పాలి అంటే మా పెద్దబ్బాయి ఎలా చనిపోయారో కూడా మాకు తెలియదు. మా పెద్దబ్బాయి 2003లో చనిపోయారు. పెద్దబ్బాయి సూసైడ్ చేసుకున్నారని చెప్పారు కానీ నిజం ఏంటని తెలియదు. ఒక అమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయి ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నారు అని మాతో చెప్పారు. మధ్యాహ్నం 12:08 గంటల సమయంలో మా పెద్దబ్బాయి సూసైడ్ చేసుకుంటే.. మాకు 2:30 గంటల సమయంలో చెప్పారు. అది కూడా మా అబ్బాయి ప్రేమించిన అమ్మాయి ఇంటి తరఫు వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇలా జరిగింది చెప్పారు. మరి మా అబ్బాయి నిజంగానే సూసైడ్ చేసుకున్నారా? లేక ఎవరైనా చంపేశారా? అన్నది తెలియదు. ఇక మేమంతా భారతి రాజా హాస్పిటల్ కి వెళ్తే.. అక్కడ వాడు స్ట్రెచర్ పై పడి ఉన్నాడు. పెద్దబ్బాయి చేతికి వచ్చాడు. ఆరడుగులు ఉంటాడు.. చాలా అందంగా ఉంటాడు. సినిమాలలో హీరోగా నటింప చేద్దామని ఎన్నో కలలు కన్నాము. కానీ చేతికొచ్చిన కొడుకు చనిపోయేసరికి సగం చచ్చిపోయాను. ఇక బాధలో ఏమీ అడగలేకపోయాను” అంటూ ఎమోషనల్ అయ్యింది నాగమణి . ఇక పెద్దబ్బాయి చనిపోయిన ఐదు సంవత్సరాలకే 2008లో చిన్నబ్బాయి ఆక్సిడెంట్ లో చనిపోయిన విషయం తెలిసిందే.