Good Bad Ugly Trailer :అజిత్ (Ajith) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, వై రవిశంకర్, నవీన్ యార్నేని నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ (శుక్రవారం )ట్రైలర్ను విడుదల చేశారు. అజిత్ అభిమానులకు కావలసిన అన్ని అంశాలను ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచీ ట్రైలర్ రిలీజ్..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, త్రిష (Trisha) రెండు నెలల గ్యాప్ తో మరో మూవీ తో మన ముందుకు రానున్నారు. సమ్మర్ స్పెషల్ ఎంటర్టైనర్ గా వచ్చేవారం ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఈ మూవీ ట్రైలర్ లో అజిత్ యాక్షన్స్ సీన్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కూడా అజిత్ అభిమానులు ఎలా చూడాలని ఎదురుచూస్తున్నారో అలాంటి మాస్ లుక్స్ అండ్ కంటెంట్ తో రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ట్రైలర్ నిడివి రెండు నిమిషాలు అయినా ఈ వీడియోలో అజిత్ యాక్షన్, మాస్ లుక్స్ ని, డైరెక్టర్ రవిచంద్రన్ బాగా ప్రజెంట్ చేశారు. ఒకవైపు మాస్ లుక్స్ తో పాటు మరోవైపు స్టైలిష్ యంగ్ లుక్ లో కూడా అజిత్ ని చూపించి ఆశ్చర్యపరిచారు. టైటిల్ కి తగ్గట్టుగా హీరో వివిధ పాత్రలో నటిస్తున్నట్లు మనకి తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ మూవీ ప్రమోషన్స్ లో అజిత్,త్రిష కృష్ణన్ పాత్రలను మాత్రమే రిలీజ్ చేస్తూ వచ్చారు. ఎటువంటి హంగామా లేకుండా ట్రైలర్ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే మనకి ఈ సినిమాలో భారీ తారాగణం ఉన్నట్లు తెలుస్తోంది. విలన్ గా అర్జున్ దాస్, ప్రియా ప్రకాష్, సిమ్రాన్, సునీల్, ప్రసన్న, ప్రభు, యోగి బాబు కీలక పాత్రలో నటించారు. వీరితోపాటు రాహుల్ దేవ్, ప్రదీప్ కబ్రా, హరి జోష్, కేజీఎఫ్ అవినాష్, షియాజీ షిండే ఇతర సపోర్టింగ్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ ట్రైలర్ కి స్పెషల్ ఎట్రాక్షన్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ కూడా హైలెట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా గొప్పగా కనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ సినిమా ట్రైలర్ అజిత్ అభిమానులకు సడన్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఈ ట్రైలర్ చూసిన అజిత్ అభిమానులు కాలర్ ఎగరేసుకునే సీన్స్ ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో పట్టుదల సినిమాతో అజిత్ ఆశించిన రేంజిలో సక్సెస్ కాలేకపోయారు మరి ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటారో లేదో బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో చూడాలి. 10 వ తేదీన మన ముందుకు వస్తున్న ఈ మూవీ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుందాం.