Anant Ambani Padayatra| అతను ఓ రాజకుమారుడు లాంటి హోదా కలడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల కుటుంబాల జాబితాలో అతని కుటుంబం గుర్తింపబడింది. అయినా అతను వందల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాడు. పైగా అతనికి తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయి. తీవ్ర ఊబకాయం, అస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు.. ఇవన్నీ అతనికి అడ్డంకిగా మారలేదు. కేవలం దైవారాధనే లక్ష్యంగా శరీరం పూర్తిగా సహకరించకపోయినా ప్రతి రోజు 20 కిలోమీటర్లు నడుస్తున్నాడు. అతనే అనంత్ అంబానీ.
రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జామ్‌నగర్ నుండి ద్వారకా వరకు 170 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు.
Also Read: చిక్కుల్లో ముఖ్యమంత్రి కూతురు.. ఆర్థిక మోసాల కేసులో జైలు శిక్ష?
శ్రీకృష్ణుడి పట్ల అపారమైన భక్తి కలిగిన అనంత్ అంబానీ తన 30వ జన్మదినాన్ని పురస్కరించుకుని ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుని దర్శించుకోవాలని తలంచారు. ఈ నిర్ణయంతో మార్చి 29న 170 కిలోమీటర్ల పొడవైన పాదయాత్రను ప్రారంభించారు. జామ్‌నగర్‌లోని మోతీ ఖావ్డీ నుండి తన యాత్రను ప్రారంభించిన అనంత్, ఏప్రిల్ 10న ద్వారకా చేరుకుని తన 30వ పుట్టినరోజును అక్కడే జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ యాత్ర సమయంలో సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో రాత్రిపూట మాత్రమే ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
అనంత్ అంబానీ ఊబకాయానికి ఇవే కారణాలు
అనంత్ అంబానీ చిన్నతనం నుంచి ఆస్తమాతో బాధపడుతున్నారు. దీనికి తోడు ఆయనకు కుషింగ్ సిండ్రోమ్ అనే సమస్య కూడా ఉంది. ఈ సమస్య ఉన్నవారి శరీరంలో డిప్రెషన్ కలిగించే కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇవే ఆయన ఊబకాయానికి ప్రధాన కారణం. ఈ అంశంపై ఓ సారి ఆయన తల్లి నీతా అంబానీ మాట్లాడుతూ.. అనంత్‌కు చిన్నతనంలో తీవ్రమైన ఆస్తమా ఉండటంతో చికిత్సలో భాగంగా ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్‌లు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. ఈ స్టెరాయిడ్‌లు ఆకలి పెంచడం, జీవక్రియను మారుస్తూ శరీరంలో కొవ్వు నిల్వల్ని పెంచడం వల్ల అనంత్ బరువు అధికమయ్యిందన్నారు. దీర్ఘకాలంగా స్టెరాయిడ్‌ల వినియోగం అధిక బరువుకు ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు.
యువతకు అనంత్ అంబానీ సందేశం
ఈ పాదయాత్ర సందర్భంగా అనంత్ అంబానీ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి పనిని ప్రారంభించే ముందు ద్వారకాధీశుడిని స్మరించడం తన అభ్యాసమని అన్నారు. “ద్వారకాధీశుడిని స్మరించినప్పుడు ఏ పనైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది,” అని పేర్కొన్నారు. “జామ్‌నగర్‌లోని మా ఇంటి నుంచి ద్వారకా వరకు పాదయాత్ర కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా నడుస్తున్న ఈ యాత్రను ఇంకో రెండు నుంచి నాలుగు రోజుల్లో ముగించి ద్వారక చేరుకుంటాం,” అని వివరించారు.
అలాగే యువతకు సందేశమిస్తూ, “ద్వారకాధీశుడైన శ్రీకృష్ణునిపై విశ్వాసం ఉంచాలి. ఏ పనిని చేయబోయినా ముందుగా ఆయనను స్మరించాలి. అప్పుడు ఆ పని నిరాటంకంగా పూర్తవుతుంది. భగవంతుడు ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు,” అని చెప్పారు.
జంతు ప్రేమను చాటుకున్న అనంత్ అంబానీ
పాదయాత్రలో ఉన్న అనంత్ అంబానీ తన జంతుప్రేమను మరోసారి చాటుకున్నారు. జామ్‌నగర్ నుండి ద్వారకాకు ప్రయాణించే మార్గంలో కంభాలియా వద్ద తారసపడిన ఓ కోళ్ల వ్యాన్‌ను చూసి ఆగిపోయారు. అనంతరం ఆ వాహనాన్ని ఆపించి, అందులో ఉన్న వందలాది కోళ్లను విముక్తి చేశారు. యజమానికి తగిన మొత్తాన్ని చెల్లించాలని తన బృందానికి ఆదేశించారు. ఈ సందర్భంగా అనంత్ తన చేతుల్లో ఓ కోడిని పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు అనంత్ అంబానీ జంతువులపై చూపిన ప్రేమను అభినందిస్తున్నారు.
అనంత్ అంబానీ ‘వంతరా’ పేరిట ఒక జంతు సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. మూగజీవాల రక్షణకు, పునరావాసానికి ఆయన పాటుపడుతున్నారు.
‘ప్రాణి మిత్ర’ జాతీయ అవార్డు పొందిన వంతరా
ఆధ్యాత్మికత, భక్తితో పాటు వన్యప్రాణుల సంరక్షణకు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న అనంత్ అంబానీ స్థాపించిన ‘వంతరా’ అటవీ సంస్థకు గౌరవప్రదమైన జాతీయ ‘ప్రాణి మిత్ర’ అవార్డు లభించింది. కార్పొరేట్ విభాగంలో ఈ అవార్డు లభించింది. భారత ప్రభుత్వం అందించే జంతు సంక్షేమానికి సంబంధించిన అత్యున్నత పురస్కారమైన ఇది.
వంతరా సంస్థ జంతువులను రక్షించడం, పునరావాసం చేయడం, అలాగే స్థిరమైన మరియు సురక్షిత వాతావరణాన్ని కల్పించడం వంటి కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా ఏనుగుల రక్షణ, చికిత్స మరియు జీవితకాల సంరక్షణకు అంకితంగా పనిచేస్తున్న ఈ సంస్థ చేసిన విశేష కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని అందించారు.
అనంత్ అంబానీ ఒక వైపు భక్తితో నిండిన పాదయాత్ర చేస్తూ, మరోవైపు జంతుప్రేమతో కూడిన సంకల్పాలను ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమైన విషయం.