Allari Naresh: టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు అల్లరి నరేష్(Allari Naresh) ఒకరు.. ప్రముఖ హాస్య దర్శకుడు ఇవివి సత్యనారాయణ కుమారుడిగా నరేష్ అల్లరి అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో తన అద్భుతమైన కామెడీ ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈయన తన మొదటి సినిమా పేరుని తన ఇంటిపేరుగా మార్చుకొని ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. గతంలో వరుస కామెడీ సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన అల్లరి నరేష్ క్రమక్రమంగా తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి అల్లరి నరేష్ దూరమయ్యారు.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన నాంది సినిమా ద్వారా సరికొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎప్పుడూ నటించిన విధంగా కామెడీ పాత్రలు కాకుండా అల్లరోడికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు చూపించారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లరి నరేష్ ఇదే జానర్ లో సినిమాలు చేసినప్పటికీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయారు. అల్లరి నరేష్ రీ ఎంట్రీ తర్వాత ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాలలో నటించిన ఈ సినిమాలు మాత్రం సక్సెస్ అందించలేకపోయాయి. ఇక నాసామి రంగ సినిమాలో అల్లరి నరేష్ నటించారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఆ సక్సెస్ క్రెడిట్ మొత్తం నాగార్జునకి దక్కిందని చెప్పాలి.
ఇలా అల్లరి నరేష్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన తనకు మాత్రం సరైన సక్సెస్ అందలేదని చెప్పాలి. ఇకపోతే అల్లరి నరేష్ గత ఏడాది సరికొత్త సినిమాకు కమిట్ అయ్యారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అల్లరి నరేష్ హీరోగా మెహర్ తేజ్(Mehar Tej) దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను కూడా శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు ఈ సినిమా 50% షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ కి జోడిగా రుహాని శర్మ(Ruhani Sharma) హీరోయిన్గా నటించబోతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా ఎలాంటి టైటిల్ అనౌన్స్ చేయలేదు కానీ తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమాకు డైరెక్టర్ మెహర్ తేజ్ ఆల్కహాల్(Alcohol) అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాలో అల్లరి నరేష్ విభిన్నమైన పాత్రలో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే హీరోకి మందు తాగే అలవాటు లేదు మరి ఆ టైటిల్ ఎందుకు పెట్టారనే సస్పెన్స్ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందేనని చిత్ర బృందం చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఈ టైటిల్ గురించి త్వరలోనే అధికారక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తుంది.