Allu Arjun Case: సినీ ఇండస్ట్రీలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన అంశం సంధ్య థియేటర్ ఘటన. ‘పుష్ప 2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యామిలీతో సహా ర్యాలీ నిర్వహించుకుంటూ రావడంతో అభిమానులు ఆయనను చూడడానికి ఎగబడ్డారు. దీంతో బౌన్సర్లు ఆడియన్స్ పై కాస్త విచక్షణారహితంగా ప్రవర్తించడంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదలడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు ఆమె కొడుకు శ్రీ తేజ్ కూడా ప్రస్తుతం హాస్పిటల్ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 13వ తేదీ అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో ఆయనను చంచల్గూడా జైలుకు తరలించారు. కానీ వెంటనే అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేయగా.. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ లభించింది.. కానీ ఐదున్నర గంటల తర్వాత బెయిల్ లభించడంతో ఆరోజు రాత్రంతా అల్లు అర్జున్ ని జైల్లోనే ఉంచారు పోలీసులు. ఆ మరుసటి రోజు ఉదయం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద బయటకు రావడం జరిగింది.
పోలీసులు కౌంటర్ దాఖలు..
ఇకపోతే రిమాండ్ గడువు ముగియడంతో ఇటీవల నాంపల్లి కోర్టు విచారణకు వర్చువల్ గా హాజరయ్యారు అల్లు అర్జున్. విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయడానికి పోలీసులు సమయం కోరడంతో తదుపరి విచారణను జనవరి 10 కి వాయిదా వేసింది కోర్టు. అయితే ఈరోజు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ముఖ్యంగా బెయిల్ పిటిషన్ పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తుండడం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మధ్యంతర బెయిల్ రద్దు పై వెనక్కి తగ్గిన పోలీసులు..
అసలు విషయంలోకి వెళ్తే.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల తర్వాత.. మధ్యంతర బెయిల్ మీద వున్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తన తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. దీంతో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి ఎలా ప్రెస్ మీట్ పెడతారంటూ ఆగ్రహించిన పోలీసులు.. మరొకసారి అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చి ప్రత్యక్షంగా విచారించారు చిక్కడపల్లి పోలీసులు. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ విచారణలో మొత్తం 18 ప్రశ్నలు అడగగా అందులో 15 ప్రశ్నలకు మాత్రమే అల్లు అర్జున్ సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ రద్దు ఆలోచనపై వెనక్కి తగిన పోలీసులు, ఈరోజు కౌంటర్లో పేర్కొనే అంశాల తీవ్రతను బట్టి బెయిల్ పై నిర్ణయం ఆధారపడి ఉందని సమాచారం. ఇక జనవరి 10వ తేదీన విచారణను బట్టి రెగ్యులర్ బెయిల్ పై స్పష్టత లభిస్తుందట.
పోలీసుల కౌంటర్ దాఖలపై ఉత్కంఠ..
ఇకపోతే ఉత్కంఠ ఎందుకు అనే విషయానికొస్తే.. మొన్న చిక్కడపల్లికి రావాలని పోలీసులు నోటీసులు జారీ చేసిన సమయంలోనే మభ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేయాలని అనుకున్నారు. కానీ వేయలేదు. మరి ఇప్పుడు కౌంటర్ దాఖలు చేసే సమయంలో ఎలా రెస్పాండ్ అవుతారు? అసలు మధ్యంతర బెయిల్ ని క్యాన్సిల్ చేయాలని చెబుతారా? లేక మద్యంతర బెయిల్ ను కొనసాగించాలని కోరుతారా? అనేది ఇప్పుడు మరింత ఉత్కంఠ గా మారింది.మొత్తానికైతే రెగ్యులర్ బెయిల్ పై పూర్తి స్పష్టత రావాలి అంటే జనవరి 10 వరకు ఎదురుచూడాల్సిందే.