Vijay Devarakonda : కొన్నిసార్లు సినిమాలు చేస్తున్నప్పుడు హీరో హీరోయిన్లు ఇబ్బందులు పడడం అన్నది సర్వసాధారణం. సినిమాకు సైన్ చేసేటప్పుడే ఇలాంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా అని చూసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం సినిమాలు చేశాక ఇబ్బందిగా ఫీల్ అయ్యాం అని బాధపడతారు. తాజాగా విజయ్ దేవరకొండ సినిమాలో చేసినందుకు తన కూతురు అన్ కంఫర్టబుల్ గా ఫీలయ్యింది అంటూ స్టార్ హీరోయిన్ తండ్రి బాంబు పేల్చాడు.
విజయ్ దేవరకొండ మూవీ పై హీరోయిన్ తండ్రి కామెంట్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చేసిన ఫస్ట్ పాన్ ఇండియా ప్రయత్నం ‘లైగర్’ (Liger). అలాగే ఆయన ఫస్ట్ హిందీ మూవీ కూడా ఇదే. 2022లో పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండే (Ananya Panday) నటించింది. తాజాగా ఈ విషయంపై అనన్య పాండే తండ్రి, నటుడు చుంకీ పాండే (Chunkey Panday) మాట్లాడుతూ ఆమె ఈ సినిమాలో నటించినప్పుడు అన్ కంఫర్టబుల్గా ఫీల్ అయిందని, ఆ పాత్ర చేయడానికి తాను ఇంకా చాలా చిన్న పిల్లలను అని ఫీల్ అయిందని వెల్లడించారు.
“లైగర్ మూవీకి సైన్ చేసినప్పుడు అనన్య పాండే వయసు కేవలం 23 ఏళ్లు. అయితే అనన్య ముఖం చిన్నగా ఉండటం వల్ల ఆమె చిన్నపిల్లలాగా కనిపించింది” అని చుంకీ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. “ఈ సినిమా కంటే ముందే అనన్య స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో పాటు 4 సినిమాల్లో నటించింది. అయితే వాటిలో ఒక్క సినిమా కూడా మాస్ ఎంటర్టైనర్ కాదు. దీంతో ‘లైగర్’ వంటి సినిమాలో నటించడానికి ఆ టైంలో తను భయపడుతున్నట్టు చెప్పింది” అని చుంకీ గుర్తు చేసుకున్నారు.
“అసలు ఈ సినిమాని చేయాలా వద్దా అని అనన్య నన్ను అడిగినప్పుడు, నేను చేయమని చెప్పాను. అయితే ఆమె అసౌకర్యంగా ఫీల్ అయింది. అందుకే ఈ రోల్ కి నేను చాలా చిన్న పిల్లని అని చెప్పింది” అంటూ ‘లైగర్’ మూవీ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
“అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన సిరీస్ కాల్ మీ బేలో అనన్య నటించడం కరెక్టా కాదా అన్న విషయంలో నాకు డౌట్ ఉండేది. అయితే కాల్ మీ బేవల్ల ఆమెకు ఫిలింఫేర్ అవార్డు నామినేషన్ రావడం సంతోషంగా అనిపించింది. ఆమె నిర్ణయం కరెక్ట్ అన్పించింది. అందుకే ఇకపై అనన్య స్వయంగా స్క్రిప్ట్ లు సెలెక్ట్ చేసుకోవడం మంచిదని, సలహాలు ఇవ్వడం మానేశాను” అని చుంకీ వెల్లడించారు. “ఒకవేళ తనను ఈ సిరీస్ చేయాలా వద్దా అని అనన్య నన్ను అడిగితే నో చెప్పే వాడిని” అని చుంకీ కుండ బద్దలు కొట్టారు.
అనన్య పాండే రియాక్షన్
కాగా గతంలో అనన్య పాండే కూడా తనకు ‘లైగర్’ సినిమాలో నటించడం ఇష్టం లేదని, కానీ తండ్రి బలవంతం మీద నటించాల్సి వచ్చిందని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక 125 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ‘లైగర్’ మూవీ 60 కోట్లు మాత్రమే రాబట్ట కలిసింది. అనన్య పాండే ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘కేసరి చాప్టర్ 2’లో నటిస్తోంది.