Tollywood Film Chamber:హెచ్ఎం రెడ్డి (HM Reddy) దర్శకత్వంలో.. 1932 లో విడుదలైన భక్తిరస కావ్యం భక్త ప్రహ్లాద(Bhaktha Prahladha) విడుదలైన రోజు ఈరోజే. దీనికి తోడు తెలుగు సినిమా పూర్తి నిడివితో విడుదల అయింది. కాబట్టి ఈరోజునే తెలుగు సినిమా పరిశ్రమ పుట్టిన రోజుగా పరిగణిస్తున్నారు. ఈ మేరకు తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం కూడా ఫిలిం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజు కాబట్టి.. అదే రోజు ప్రతి ఏడాది వేడుకలు నిర్వహించి, ఆ వేడుకలలో అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిలిం ఛాంబర్ నుంచి కూడా అవార్డులు ఉంటాయని, ముఖ్యంగా తెలుగు సినిమా పుట్టినరోజు నాడు ప్రతి సినిమా నటుడు ఇంటి పైన అలాగే థియేటర్ల వద్ద ప్రత్యేకంగా తెలుగు జెండా ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna) కు అప్ప చెప్పింది తెలుగు ఫిలిం ఛాంబర్. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక తెలుగు సినిమా పుట్టినరోజును ప్రతి ఒక్క తెలుగు సినీ నటుడు జరుపుకోవాలని కోరింది.
సమావేశంలో పాల్గొన్న అతిథులు వీరే..
తెలుగు ఫిలిం ఛాంబర్ లో తెలుగు సినిమా దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు మురళీమోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ , దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, రచయిత జర్నలిస్ట్ రెంటాల జయదేవ్, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ , సెక్రటరీ ప్రసన్న కుమార్ తదితరులు ఇందులో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 6న తెలుగు సినిమా దినోత్సవం గా ప్రకటించారు.
స్పందించిన మురళీ మోహన్..
ఈ మేరకు మురళీమోహన్ మాట్లాడుతూ.. కీలక కామెంట్స్ చేశారు. మురళీమోహన్ మాట్లాడుతూ..”రాజకీయ నాయకుల కంటే సినిమా వాళ్లకే ప్రజలలో ఎక్కువ ఆదరణ ఉంది. రాజకీయ నాయకుడికి పదవీకాలం పూర్తయ్యాక ప్రజలలో ఆదరణ ఉండదు. క్రీడాకారులకు కూడా అంతంత మాత్రమే ఆదరణ ఉంటుంది. కానీ సినీ నటులు మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారు. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మద్రాస్ లో ఉన్నప్పుడు మేము సినిమా కులమని గర్వంగా చెప్పుకునే వాళ్ళము” అంటూ తెలిపారు మురళీమోహన్. మురళీమోహన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.