A.R.Rahman: ప్రముఖ ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) అనారోగ్య సమస్యతో ఇటీవలే అపోలో హాస్పిటల్లో చేరగా.. తాజాగా ఆయన డిస్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వైద్య బృందం హెల్త్ బులిటెన్ కూడావిడుదల చేయగా.. డీహైడ్రేషన్ వల్లే ఆయన అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరమేమీ లేదని, వైద్య పరీక్షలు నిర్వహించి,చికిత్స అందించామని వైద్యులు స్పష్టం చేశారు. మొత్తానికైతే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో.. అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
అస్వస్థతకు గురైన ఏఆర్ రెహమాన్..
అసలు విషయంలోకి వెళ్తే.. అకస్మాత్తుగా ఏఆర్ రెహమాన్ కు ఛాతీ నొప్పి రావడంతో ఆయనను చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చేర్పించారు. అత్యవసర విభాగంలో చేరిన ఏఆర్ రెహమాన్ యాంజియోగ్రఫీ చికిత్స పొందుతున్నారని.. వైద్య బృందం ఆయనను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే లండన్ వెళ్లిన రెహమాన్ ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు
ఈ పరిస్థితుల్లో ఆయనకి అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను అపోలో హాస్పిటల్ లో చేర్పించారు. ముఖ్యంగా లండన్ లోని ఒక సంగీత కళాశాల కార్యక్రమంతో కలిసి ఏఆర్ రెహమాన్ ఒక కచేరి నిర్వహించారు. అనంతరం ఇతరుల సంగీత అభిరుచులు, ప్రతిభను ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు. ఇంటికి చేరుకున్న వెంటనే ఇలా హాస్పిటల్ పాలవడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవడమే కాకుండా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఎట్టకేలకు ఈరోజు ఆయన కొద్దిసేపటి క్రితమే చెన్నై అపోలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.
విడాకుల తర్వాతే అలుముకుంటున్న విషాదం..
ఏ ఆర్ రెహమాన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తమిళ్లోనే కాదు అనేక భాషల్లో పని చేసిన ఈయన.. హిందీలో కూడా తన సంగీతంతో శ్రోతలను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఏదైనా చిన్న కమర్షియల్ యాడ్స్ కోసం సంగీతం సమకూర్చినా సరే అభిమానులు పరవశించిపోతారు. ఎన్నో వందలాది పాటలను కంపోజ్ చేసిన ఏఆర్ రెహమాన్ జీవితంలో అత్యున్నత శిఖరాలను అందుకున్నారు. అత్యంత గౌరవంగా భావించే ఆస్కార్ అవార్డును ఏకంగా రెండుసార్లు సొంతం చేసుకోవడం గమనార్హం. ఇలా వృత్తిపరంగా ఎన్నో శిఖరాలు అందుకున్న ఈయన ఇప్పుడు తన భార్య నుండి విడాకులు తీసుకున్న తరువాతనే ఆయన జీవితంలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. పెద్దల అంగీకారంతో సైరా భాను (Saiara bhanu) ను వివాహం చేసుకున్నారు. దాదాపు 29 సంవత్సరాల వైవాహిక బంధాన్ని ఎంతో చక్కగా కొనసాగించారు. కానీ ఏమైందో తెలియదు. గత ఏడాది ఇద్దరూ విడిపోయారు. ముఖ్యంగా సైరా భాను న్యాయవాది వందన షా ఈ విషయాన్ని తెలుపుతూ రెహమాన్ నుండి సైరా భాను విడిపోయింది అంటూ ప్రకటించింది.జీవితంలో విడాకులకు చోటు ఇవ్వకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ జంట 29 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక భార్య దూరమైన తర్వాతే ఈయనకు కలిసి రావడంలేదని, ఇలా అనారోగ్య సమస్యలు కూడా ఆయనను చుట్టుముడుతున్నాయని నెటిజన్స్ తో పాటు అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై ఏఆర్ రెహమాన్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.