Joint HomeLoan Tax Benefits| ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కలలు కంటూ ఉంటారు. ఆ కలలను నిజం చేసుకోవడానకి ఎంతో కష్టపడుతుంటారు. వారి జీతంలో నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తుంటారు. నిర్ణీత మొత్తాన్ని పొదుపు చేసిన తర్వాత బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ వంటి సంస్థల్లో గృహ రుణం కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. ఈ ప్రక్రియలో కొంచెం భిన్నంగా ఆలోచిస్తే, మంచి పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. భార్యాభర్తలు కలిసి జాయింట్ హోం లోన్ తీసుకుంటే.. దీర్ఘకాలంలో ఆర్థిక సౌకర్యం, సౌలభ్యాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుందో తెలుసుకుందాం.
దంపతులు కలిసి రుణం తీసుకోవడం
భార్యాభర్తలు కలిసి జాయింట్ హోం లోన్ తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. రుణ భారాన్ని సంయుక్తంగా పంచుకునే సౌలభ్యం కలుగుతుంది.
అధిక రుణ అర్హత
భార్యాభర్తలు కలిసి గృహ రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు.. ఇద్దరి ఆదాయాలను బ్యాంకులు పరిశీలిస్తాయి. ఇద్దరూ సంపాదనాపరులైతే.. ఎక్కువ మొత్తంలో రుణం మంజూరు చేయబడే అవకాశం ఉంటుంది. ఆ మొత్తంలో ఓ మంచి ఇల్లు కొనడానికి వీలుంటుంది.
Also Read: కేంద్రం గుడ్ న్యూస్.. రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు
రుణ బాధ్యతను సగానికి పంచుకోవడం
జాయింట్ హోం లోన్‌కు సంబంధించిన ఈఎంఐ (EMI)ను భార్యాభర్తలు సగానికి పంచుకోవచ్చు లేదా వారి జీతాలకు అనుగుణంగా చెల్లించుకోవచ్చు. ఇందుకోసం ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకోవాలి.
పన్ను ప్రయోజనాలు
దంపతులు కలిసి గృహ రుణం తీసుకున్నందున, ఇద్దరూ వేర్వేరుగా పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది పన్ను ప్రయోజనాలను రెట్టింపు చేస్తుంది.
మహిళా రుణగ్రహీతలకు అదనపు ప్రయోజనాలు
మహిళ ప్రాథమిక రుణగ్రహీతగా ఉంటే.. గృహ రుణంపై సగటున 0.05% నుంచి 0.1% వరకు వడ్డీ రేటు తగ్గించబడుతుంది. రుణం తీసుకునే ముందు ఈ వివరాలను బ్యాంకులో తెలుసుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో, మహిళలు గృహ రుణం తీసుకున్నప్పుడు స్టాంప్ డ్యూటీలో తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఇది ఆస్తి కొనుగోలు ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది.
జాయింట్ హోం లోన్ తీసుకునే దంపతులు ఇద్దరూ సెక్షన్ 80సీ, సెక్షన్ 24బీ కింద వేర్వేరుగా పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు.
సెక్షన్ 80సీ
దంపతులు ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన అసలు మొత్తంలో రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు.
సెక్షన్ 24బీ
జాయింట్ హోం లోన్‌కు సంబంధించి ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన వడ్డీలో రూ.2 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు క్లెయిమ్ చేయొచ్చు. ఈ ప్రయోజనాలు పొందడానికి దంపతులు అదే ఇంట్లో నివసిస్తున్నట్లయితే మాత్రమే వర్తిస్తాయి. ఇంటిని అద్దెకు ఇచ్చినట్లయితే, వడ్డీ చెల్లింపులపై ఎలాంటి పరిమితి లేదు.
ఈ రెండు పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవడం ద్వారా, భార్యాభర్తలు సంయుక్తంగా సంవత్సరానికి రూ.7 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఈ విధంగా జాయింట్ హోం లోన్ తీసుకోవడం ద్వారా ఆర్థిక సౌకర్యం, పన్ను ప్రయోజనాలు రెండింటినీ పొందగలరు.