Nag Ashwin and Ashwini Dutt : పాన్ ఇండియా డైరెక్టర్స్ లో నాగ్ అశ్విన్ (Nag Ashwin) కూడా ఒకరు. ఇక టాలీవుడ్ బడా డైరెక్టర్లలో అశ్వినీ దత్ (Ashwini Dutt) ఒకరు. ఈ మామా అల్లుళ్లు ఇద్దరూ కలిసి సినిమా చేశారంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. అయితే తాజాగా వీరిద్దరూ వేరే వేరే ఈవెంట్లలో పాల్గొని, ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేయాలనే కోరికను వ్యక్తం చేశారు.
మెగాస్టార్ తో నాగ్ అశ్విన్
‘మహానటి’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి భారీ సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్న పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin). తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో కలిసి పని చేసే అవకాశం గురించి మాట్లాడారు. ‘బ్రహ్మా ఆనందం’ మూవీ ఈవెంట్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తో పాటు నాగ్ అశ్విన్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ తో కలిసి సినిమా చేయాలనే ఆశాభావాన్ని చిరు వ్యక్తం చేశారు. “కల్కి మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయమని నాగ్ అశ్విన్ కు చెప్పాను. దీనివల్ల నాకేమైనా ఆ తర్వాత అవకాశం దొరుకుతుందేమో అనే చిన్న ఆశ” అంటూ వేదికపైనే చిరంజీవి తన మనసులోని కోరికను బయట పెట్టారు.
ఇక ఆ తర్వాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ “మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేసే అవకాశం నాకు ఇప్పటిదాకా రాలేదు. చంటబ్బాయి సినిమా చిరంజీవి సినిమాలలో నాకు ఇష్టమైన మూవీ. త్వరలోనే ఆయనతో కలసి సినిమా చేయాలని ఆశిస్తున్నాను” అని నాగ్ అశ్విన్ అన్నారు. ప్రస్తుతానికి నాగ్ అశ్విన్ చేతిలో ‘కల్కి 2’ మాత్రమే ఉంది. ఈ మూవీ పూర్తయ్యాక మెగాస్టార్ చిరంజీవితో ఆయన సినిమా చేసే అవకాశం ఉండొచ్చు.
నాగార్జునతో సినిమా చేస్తానంటున్న అశ్వినీ దత్
మరోవైపు ‘తండేల్’ (Thandel) మూవీ సక్సెస్ మీట్ లో అశ్వినీ దత్ తన మనసులోని కోరికను వెల్లడించారు. “నాగార్జున (Nagarjuna)తో ఇప్పటిదాకా ఎన్నో హిట్ మూవీలు ఇచ్చాము. ఎక్కువ సినిమాలు చేసింది కూడా ఆయనతోనే. ఇప్పుడు కూడా ఆయన డేట్స్ ఇస్తే మరో మూవీ చేయాలనుకుంటున్నాము. నాగార్జున గారు మీ డేట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాము” అంటూ అశ్వినీ దత్ వేదికపై తన ఆలోచనను వెల్లడించారు. అంటే నాగార్జున – నిర్మాత అశ్వినీ దత్ (Ashwini Dutt) కాంబోలో కూడా త్వరలోనే సినిమా తెరకెక్కే అవకాశం లేకపోలేదు. ఇలా ఓవైపు అల్లుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమా చేస్తానని మాట ఇస్తే, మరోవైపు అశ్వినీ దత్ నాగార్జునతో కలిసి సినిమా చేయాలని ఉందనే ఆలోచనను వెల్లడించారు. ఇలా మామా అల్లుళ్లు ఇద్దరూ కలిసి ఇద్దరు స్టార్ హీరోలను లైన్లో పెట్టారు. మరి ఈ రెండు సినిమాలను అశ్వినీ దత్ – నాగ్ అశ్విన్ కలిసి చేస్తారా? లేదంటే విడివిడిగా చేస్తారా? ఈ రెండు సినిమాలు పట్టాలెక్కేది ఎప్పుడు? అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.