Sai Rajesh:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ‘హృదయ కాలేయం’, ‘బేబీ’ లాంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు సాయి రాజేష్(Sai Rajesh). ఇక ఈయన తాజాగా బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్(Irfan Khan) తనయుడు బాబిల్ ఖాన్ (Babil khan) టీమ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అసలు విషయంలోకి వెళితే.. బాలీవుడ్ తీరును ఎండగడుతూ బాబిల్ ఖాన్ చేసిన వీడియో వైరల్ గా మారడంతో.. ఇప్పుడు ఇదే విషయం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. అతడి ఆవేదనను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంది. వీడియోలో చెప్పిన నటీనటులు అందరి నుంచి అతడు స్ఫూర్తి పొందాడని, ఆ ప్రకటనలో టీం వెల్లడించింది. అయితే ఇప్పుడు బాబిల్ ఖాన్ టీం ఇచ్చిన క్లారిటీ పై తెలుగు దర్శకుడు సాయి రాజేష్ (Sai Rajesh) ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెట్టారు.
మేమేమైనా పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నామా – సాయి రాజేష్
సాయి రాజేష్ తన పోస్టులో.. “మీరు ఏం చెప్పినా.. ఏం మాట్లాడుకుండా కూర్చుంటామని అనుకుంటున్నారా..? మేమేమైనా పిచ్చోళ్ళ లాగా మీకు కనిపిస్తున్నామా? వీడియోలో అతడు ప్రస్తావించిన వారు మాత్రమే మంచివాళ్లా.. అయితే ఇంతకాలం అతడికి సపోర్టుగా నిలిచిన మేము పిచ్చి వాళ్ళమా, ఒక గంట ముందు వరకు కూడా అతడికి సపోర్టుగా ఉండాలని అనుకున్నాను. కానీ మీ తీరు చూశాక ఇక్కడితో ఆగిపోవడమే మంచిది అనిపిస్తుంది. ఇకపై ఇలాంటి సానుభూతి ఆటలు పనిచేయవు.. మీరు నిజాయితీతో క్షమాపణలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది” అంటూ రాసుకు వచ్చారు.
నా మనసు ముక్కలు చేశారు – బాబిల్ ఖాన్..
అయితే వెంటనే దీనిపై స్పందించిన బాబిల్ ఖాన్.. “మీరు మాట్లాడిన మాటలు నా మనసును ముక్కలు చేశాయి. నేను మీ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. మీ సినిమాలోని పాత్రకు న్యాయం చేయడానికి రెండేళ్లు శ్రమించాను. ఎన్నో అవకాశాలని వదులుకున్నాను” అంటూ రాసుకు వచ్చారు. దీంతో వీరిద్దరి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇద్దరు కూడా పోస్టులను డిలీట్ చేయడం జరిగింది. ఇక ఎందుకు పోస్ట్ పెట్టారు? ఎందుకు డిలీట్ చేశారు? అని నెటిజన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాబిల్ ఖాన్ విడుదల చేసిన వీడియోలో ఏముందంటే..?
బాబిల్ ఖాన్ తన వీడియోలో..” ఈరోజు మీ అందరితో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. పరిశ్రమలో అర్జున్, షనయా, అనన్యతో పాటు పరిశ్రమతో సంబంధం లేకుండా బయట నుంచి వచ్చిన అర్జిత్ సింగ్ వంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈ ఇండస్ట్రీ ఎంతో అమర్యాదకరంగా మారింది. ఇప్పటివరకు నేను చేసిన వాటిల్లో అత్యంత నకిలీ పరిశ్రమ ఇది మాత్రమే.. ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునేవారు కొంతమంది ఉంటారు. నేను కూడా మీకు ఎన్నో విషయాలను చెప్పాలనుకుంటున్నాను” అంటూ తన వీడియోలో కన్నీటిపర్యంతం అయ్యారు. ఇక ఈ వీడియో ఇన్స్టాలో పెట్టి వెంటనే డిలీట్ చేశాడు. అంతేకాదు తన ఇన్స్ట ఖాతాను డి ఆక్టివేట్ కూడా చేశారు. ఇకపోతే బేబీ సినిమాతో విజయం అందుకున్న సాయి రాజేష్.. ఇదే సినిమాను బాలీవుడ్ లో రూపొందించాలనుకుని ప్లాన్ చేయగా.. అందులో హీరోగా బాబిల్ ఖాన్ ను తీసుకోబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ASLO READ:Allu Aravindh: శ్రీతేజ్ ఎలా ఉన్నాడు…? ఇన్నాళ్లకు మళ్లీ పరామర్శించిన అల్లు అరవింద్..!