Badshah : ప్రముఖ రాపర్, గాయకుడు బాద్షా (Badshah)కు గురుగ్రామ్‌లో ట్రాఫిక్ పోలీసులు చలాన్ జారీ చేసినట్లు రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కరణ్ ఔజ్లా కాన్సర్ట్ కు వెళుతున్నప్పుడు బాద్షా తన మహీంద్రా థార్ లో బిగ్గరగా మ్యూజిక్ ను ప్లే చేస్తూ, రోడ్డుకు రాంగ్ సైడ్‌లో డ్రైవింగ్ చేశాడని వార్తలు వచ్చాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై రాంగ్ డ్రైవింగ్ చేసియాడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతడికి రూ.15,000 జరిమానా విధించారు. అయితే ఇప్పుడు ఈ వార్తలను బాద్షా తోసిపుచ్చారు. మరో విచిత్రం ఏంటంటే అసలు తన దగ్గర థార్ కార్ లేదని చెప్పడం.
ఆదివారం సాయంత్రం గురుగ్రామ్‌లో గాయకుడు కరణ్ ఔజ్లా మ్యూజిక్ కాన్సర్ట్ కి హాజరయ్యేందుకు రాపర్ బాద్షా (Badshah) బయల్దేరారు. ఆ టైమ్ లో బాద్షా ఉన్న థార్‌ను రోడ్డుకు రాంగ్ సైడ్‌లో నడపడంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, గురుగ్రామ్ పోలీసులు చలాన్ జారీ చేశారు. ఒక నెటిజన్ సోషల్ మీడియాలో “పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లా మ్యూజిక్ కాన్సర్ట్ కు వెళ్తున్న కాన్వాయ్ వాహనాలు ఏరియా మాల్ వైపు రాంగ్ సైడ్‌లో వెళ్తున్నాయి. బౌన్సర్లు కూడా ప్రజలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. కానీ గురుగ్రామ్ పోలీసులు నిద్రపోతున్నారు” అంటూ ఫైర్ అయ్యారు. ఈ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ గురుగ్రామ్ పోలీసులు సదరు వాహనాలపై చలాన్ జారీ చేశారు.
ఆ తరువాత గురుగ్రామ్ ట్రాఫిక్ డిసిపి వీరేంద్ర విజ్ మూడు వాహనాల్లో ఒకదానిలో బాద్షా ఉన్నారని, అయితే అది ఏ వాహనం అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘చలాన్ జారీ చేసిన థార్ పానిపట్‌కు చెందిన దీపేంద్ర హుడా పేరు మీద నమోదైంది. అతనే కారు నడుపుతున్నాడు. మోటారు వాహన చట్టం కింద అతడిపై మొత్తం రూ.15,500 ఆన్‌లైన్ చలాన్ విధించాము’ అని చెప్పుకొచ్చారు.
తాజాగా బాద్షా ఈ విషయం గురించి స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ‘బ్రదర్, నా దగ్గర థార్ లేనే లేదు, ఆ రోజు నేను డ్రైవింగ్ చేయలేదు. నేను తెల్లటి వెల్‌ఫైర్ (టయోటా)లో వెళ్ళాము. మేము ఎప్పుడూ పూర్తి బాధ్యతతో డ్రైవ్ చేస్తాము. అది కార్లు అయినా లేదా గేమ్ లోనైనా’ అంటూ సెటైరికల్ గా రిప్లయ్ ఇచ్చారు. బాద్షా టీం కూడా ఈ వార్తలను కొట్టి పారేసింది. బాద్షా ప్రయాణించిన కారు డీటైల్స్ అన్నీ ఇస్తామని, అంతేకాకుండా తాము పూర్తిగా విచారణకు సహకరిస్తామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా… నవంబర్ లో చండీగఢ్ లోని సెక్టార్ 26లో బాద్షా (Badshah) నైట్ క్లబ్ బయట బాంబ్ పేలింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని నిందితులు మోటార్ బైక్‌పై వచ్చి రెండు క్లబ్‌లు… సెవిల్లే క్లబ్, పక్కనే ఉన్న డియోరా క్లబ్ ల బయట బాంబులను విసిరినట్లు తెలిసింది. అందులో ఒక క్లబ్ బాద్ షాకు చెందినది. ఘటన అనంతరం నిందితులు పరారయ్యారు. పేలుడు కారణంగా రెండు క్లబ్‌ల రెస్టారెంట్ లోని కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయని, అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.