TS TET Exam Hall Tickets : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం నిర్వహించే టెట్ హాల్ టికెట్లు ఈనెల 26 నుంచి అందుబాటులోకి రానున్నాయి. టెట్ పరీక్ష కోసం లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న తరుణంలో ఇందుకు సంబంధించిన కీలక అప్ డేట్ అందింది. ఈసారి పరీక్షల కోసం దాదాపు 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. వారంతా పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దశలో పరీక్షల నిర్వహణ తేదీలతో పాటు హాల్ టికెట్లు అందుబాటులోకి రావడంతో అభ్యర్థులు తుది దశ సన్నాహాలు చేసుకుంటున్నారు.
టెట్ పరీక్షల కోసం ఈనెల 26 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానుండగా.. జనవరి 01 నుంచి పరీక్షలు జరగనున్నాయి. అయితే… పూర్తి పరీక్షల షెడ్యూల్ ఇంకా విడుదల కావాల్సి ఉంది. తెలంగాణ టెట్ 2024 (II) పరీక్షలకు సమయం దగ్గరపడడంతో ఇప్పటికే.. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మొదటి తేదీ నుంచి మొదలై జనవరి 20, 2025తో టెట్ పరీక్షలు ముగుస్తాయని విద్యాశాఖ ప్రాథమికంగా వెల్లడించింది. ఒకటి, రెండు రోజుల్లోనే పూర్తి వివరాలతో కూడిన పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని.. ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు చేస్తోందని అధికారులు తెలుపుతున్నారు.
టెట్ పరీక్షల కోసం పెద్ద ఎత్తున కాంపిటీషన్ ఉంటుంది. ఈసారి కూడా పెద్ద ఎత్తున టెట్ అభ్యర్థులు పరీక్షల కోసం సిద్దమవుతున్నారు. కాగా.. ఇప్పటికే.. టెట్ కోసం దాదాపు 2 లక్షల 48 వేల 172 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఇందులోనూ పేపర్-1కు 71,655 అప్లికేషన్లు రాగా… పేపర్-2కు 1,55,971 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఎప్పటిలాగే టెట్ పరీక్షల సమయాల్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు లేవు. మొదటి సెషన్ ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై.. 11. 30 గంటలకు ముగయనుండగా, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై, 04. 30 గంటలకు ముగుస్తుంది.
ఫిబ్రవరి 5న టెట్ తుది ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. అప్పటి వరకు టెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 91 7075028882 / 85 నెంబర్లను సంప్రదించవచ్చని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.