Balagam Movie:చిత్రం, మున్నా సహా పలు చిత్రాల్లో కమెడియన్‌గా మెప్పించిన వేణు మనకు గుర్తుండే ఉంటారు. కామెడీతో ప్రేక్షకులను నవ్వించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ వేణు అసలు పేరు వేణు ఎల్దండి. ఈయన ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా డైరెక్టర్ అయ్యారు. అది కూడా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో. వివరాల్లోకి వెళితే.. దిల్‌రాజు కుమార్తె హన్షిత, సోదరుడు శిరీష్ తనయుడు హరీష్ కలిసి దిల్‌రాజు ప్రొడక్షన్ (డీఆర్‌పీ) అనే బ్యానర్‌ను స్టార్ట్ చేశారు. ఇందులో కొత్త టాలెంట్‌ను, దర్శకులను ఎంకరేజ్ చేస్తూ న్యూ కాన్సెప్ట్ తీయాలనే ఉద్దేశంతోనే ఈ బ్యానర్‌ను పెట్టినట్లు దిల్ రాజు తెలిపారు. అందులో భాగంగా డీఆర్‌పీ బ్యానర్‌లో బలగం అనే సినిమాను పూర్తి చేశారు.
బలగం సినిమాను వేణు ఎల్దండి డైరెక్ట్ చేశారు. ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా సినిమా పూర్తయ్యింది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ హీరో హీరోయిన్లుగా నటించారు. తెలంగాణలోని సిరిసిల్ల బ్యాక్ డ్రాప్‌లో సినిమా తెరకెక్కింది. ప్రతి ఇంట్లో ఉండే ఓ పరిస్థితిని వేణు సినిమా రూపంలో మలిచారు. తనకు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌కు దిల్ సినిమా ఎలాగైతే డబ్బులు, పేరు సంపాదించి పెట్టిందో దిల్‌రాజు ప్రొడక్షన్‌కు కూడా బలగం అలాంటి పేరు, డబ్బుని సంపాదించి పెడుతుందని దిల్ రాజు నమ్మకంగా చెబుతున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తానని ఆయన తెలియజేశారు.