Barack Obama : ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) తనకు ఇష్టమైన చిత్రాల జాబితాను పంచుకున్నారు. అందులో ఓ ఇండియన్ సినిమా కూడా ఉండడం విశేషం. ఆ మూవీ మరేంటో కాదు ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ (All We Imagine as Light).
గత కొన్ని నెలలుగా పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ (All We Imagine as Light) సినిమాపై అంతర్జాతీ స్థాయిలో లెక్కలేనన్ని ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పుడు అమెరికా మాజీ ప్రెసిడెంట్ కూడా ఈ సినిమానే బెస్ట్ అనేశారు. ఈ ఏడాది ఒబామా ఫేవరెట్ సినిమాల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సినిమా ఇదే. ఈ జాబితాను శుక్రవారం ఒబామా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.
ఒబామా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ‘ఈ సంవత్సరం మిస్ అవ్వకుండా చూడాలని నేను సిఫార్సు చేసే కొన్ని సినిమాలు ఇవే’ అంటూ తన ఫేవరెట్ సినిమాల లిస్ట్ ను పంచుకున్నారు. ఆయన పోస్ట్ లో ‘2024లో బరాక్ ఒబామాకి ఇష్టమైన చిత్రాలు – ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, కాంక్లేవ్, ది పియానో లెసన్, ది ప్రామిస్డ్ ల్యాండ్, ది సీడ్ ఆఫ్ ది సేక్రెడ్ ఫిగ్, డూన్: పార్ట్ 2, అనోరా, దీది, షుగర్ కేన్, ఏ కంప్లీట్ అన్ నోన్’ వంటి సినిమాలు ఉన్నాయి.
Here are a few movies I’d recommend checking out this year. pic.twitter.com/UtdKmsNUE8
— Barack Obama (@BarackObama) December 20, 2024
లంచ్, యాయో, జంప్, ఫేవరెట్, యాక్టివ్, గోల్డ్ కోస్ట్ వంటి మ్యూజిక్ ఆల్బమ్స్ ఈ ఏడాది తన మదిని దోచాయని ఒబామా చెప్పారు. గ్రోత్, ఆర్బిటల్, ది వర్క్ ఆఫ్ ఆర్ట్, ది యాంగ్జియస్ జనరేషన్, స్టోలెన్ ప్రైడ్ వంటి రచనలను ఆయన రికమెండ్ చేశారు.
ఇక ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ అనే ఈ ఇండియన్ సినిమా అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకోవడంతో ఈ మూవీ ప్రయాణం ప్రారంభమైంది. 30 ఏళ్ల తర్వాత కేన్స్‌లో ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రం ఇదే. ఈ చిత్రం ఇటీవల రెండు గోల్డెన్ గ్లోబ్స్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులకు కూడా నామినేట్ అయ్యింది. అంతేకాకుండా పాయల్ కొద్దిరోజుల క్రితం జరిగిన 29వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (IFFK)లో స్పిరిట్ ఆఫ్ సినిమా అవార్డును గెలుచుకుంది.
ఈ చిత్రానికి పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. కనికుశ్రుతి, దివ్య ప్రభ, చాయాకదం తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని నటుడు రానా తెలుగులో విడుదల చేశారు. ముంబయి నర్సింగ్ హోమ్‌లో పని చేసే ఇద్దరు నర్సుల కథతో డైరెక్టర్ పాయల్ కపాడియా ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ అనే ఈ సినిమాను రూపొందించారు. పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకున్న ఈ మూవీ ‘ఆసియా పసిఫిక్ స్క్రీన్’ పురస్కారాల్లో ఏకంగా ఐదు నామినేషన్లు దక్కించుకుంది.