Chandrabose:చంద్ర బోస్ (Chandrabose).. ప్రముఖ రచయిత , ఆస్కార్ గ్రహీత అయిన చంద్రబోస్ తన మెదడుకు పదును పెట్టి, కలానికి పని చెప్పారు అంటే అక్షరాలు కాగితంపై వాటంతటవే రూపుదిద్దుకుంటాయి. అద్భుతమైన పాటలతో శ్రోతలను అలరించి ఇటీవల ఆస్కార్ కూడా అందుకున్న ఈయన.. ప్రస్తుతం’ పాడుతా తీయగా’ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు మరొకవైపు ఒక ప్రముఖ ఛానల్లో ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిరివెన్నెలతో తనకున్న బంధాన్ని ఆయన పంచుకున్నారు. ఒకానొక సమయంలో ఆటోగ్రాఫ్ అడిగినప్పుడు సిరివెన్నెల (Sirivennela) ఏం చేశారు అనే విషయాన్ని గుర్తుతెచ్చుకొని మరీ ఇంత గొప్ప వారిని తన జీవితంలో చూడలేదంటూ.. ఆనంద భాష్పాలతో కన్నీరు కార్చారట. మరి చంద్రబోస్ సిరివెన్నెల గురించి చెప్పిన మాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అలా మొదలైంది నా తొలి ప్రయాణం -చంద్రబోస్..
చంద్రబోస్ మాట్లాడుతూ.. నేను బాల్యంలోనే ఎక్కువగా పాటలు పాడే వాడిని. క్రమేనా రాయడం కూడా అలవాటయింది. ఒకసారి హైదరాబాద్లో నేను చదువుకున్న కళాశాలలో పాటల పోటీలు పెట్టారు. అప్పుడు నేను సిరివెన్నెల రాసిన ‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అనే పాట పాడి బహుమతి కూడా గెలుచుకున్నాను. అలా ఆ పాటతో నేను గాయకుడిగా ప్రపంచానికి పరిచయమయ్యాను. సినిమా పాటల నుంచే ఎన్నో అంశాలు నేర్చుకొని పాటలు రాయడం మొదలుపెట్టా.. అందుకే నన్ను దర్శకుడు వీ.యన్.ఆదిత్య (V.N Adithya) ‘సినిమా చెక్కిన కవి’ అని అంటుంటారు. ఇకపోతే సిరివెన్నెలే నా ఆరాధ్య దైవంగా భావిస్తూ.. ఆయన మాటల స్వరాన్ని, లోతుని అర్థం చేసుకుంటూ.. ఆయన సాహిత్యం అందించిన ‘తాజ్ మహల్’ సినిమాకు మొదటి పాట రాశాను. అలా మొదలైన మా ప్రయాణం 27 ఏళ్ల పాటు కొనసాగింది. ఇక నేను రాసిన పాటలలో ‘మంచు కొండల్లోన’, ‘పల్లవించుతున్న ప్రణయమా మళ్లీమళ్లీ వచ్చిపో’ పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి మెచ్చుకున్నారని తాజ్ మహల్ డైరెక్టర్ ముప్పలనేని శివ (Muppalaneni Siva) నాతో అన్నారు.
సిరివెన్నెలను ఆటోగ్రాఫ్ అడిగితే.. ఏం చేశారంటే..
ఇక ‘పెళ్లి సందడి’ సినిమాకు నేను పనిచేస్తున్న సమయంలో సిరివెన్నెల గారిని మొదటిసారి కలిశాను. ఆ సమయంలో ఆయన నన్ను చూసి బాగా రాస్తున్నావని ప్రోత్సహించారు. అయితే ఆయనను కలవడం అదే మొదటిసారి. దాంతో ఆయన ఆటోగ్రాఫ్ అడిగాను. కానీ ఆయన మాత్రం ‘మెత్తగా పలుకుతున్న కొత్త కోయిలకు అభినందనలు’ అని రాసి ఇచ్చారు. దాంతో ఆయన నన్ను పొగిడారని అర్థం చేసుకొని ఇంత గొప్ప వ్యక్తి నన్ను పొగడడం, పైగా నన్ను ప్రోత్సహించడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా ఆయన నాతో చాలా స్నేహంగా ఉండేవారు. నాకు ఆయనకు ఎలాంటి చుట్టరికం లేకపోయినా.. పల్లెటూరి నుంచి వచ్చిన నన్ను ఆయన చేరదీయడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఆయన గొప్ప సాహిత్యకారుడే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు చంద్రబోస్. ఇక ప్రస్తుతం చంద్రబోస్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Trivikram Srinivas : నువ్వు అసలు మనిషివేనా..? త్రివిక్రమ్‌పై హిందూ సంఘాలు ఫైర్