Allu Arjun Interrogation :సినీ ఇండస్ట్రీలో సంధ్యా థియేటర్ ఘటన సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ సంఘటనను ఇప్పట్లో ఎవరు మరిచిపోయేలా కనిపించడం లేదు. సంధ్యా థియేటర్ ఘటనలో రేవతి(39)అనే మహిళ అక్కడికక్కడే మరణించింది. ఆమె కుమారుడు శ్రీ తేజ్(9) ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత అల్లు అర్జున్ (Allu Arjun) దే అని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది అల్లు అర్జున్ తప్పు ఏముంది? అంటూ కామెంట్లు చేస్తున్నారు. తప్పు ఎవరిదైనా ప్రాణం పోయింది. ఆ పోయిన ప్రాణాన్ని ఎవరూ తీసుకురాలేము.. కానీ చేసిన తప్పుకు శిక్ష కచ్చితంగా అనుభవించాల్సిందే.. అది ఎంతటి వారైనా తప్పదు అనే టాక్ కూడా వస్తుంది.
విచారణ ముగిసింది.. ఇంటికి బయలుదేరిన బన్నీ..
ఇదిలా ఉండగా ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు అల్లు అర్జున్ విచారించారు పోలీస్ అధికారులు. మొత్తం 18 ప్రశ్నలను పోలీసులు ప్రశ్నించగా అందులో అల్లు అర్జున్ కొన్నింటికి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీడియో క్లిప్ లను చూపించి మరీ ప్రశ్నించారట. ఇకపోతే మూడున్నర గంటల పాటు సాగిన ఈ విచారణను పూర్తిగా వీడియోగ్రఫీ చేసినట్లుగా కూడా సమాచారం. కొంతసేపటి క్రితం విచారణ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చి ఇంటికి బయలుదేరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇకపోతే విచారణ ఇంతటితో పూర్తి కాలేదు. మళ్లీ విచారణకు పిలిస్తే అందుబాటులో ఉండాలని పోలీసులు సూచించారట. మరి నిజంగానే మళ్లీ విచారణ ఉంటుందా..? మళ్లీ నోటీసులు పంపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసేటప్పుడే సంధ్య థియేటర్ కి అవసరమైతే వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారట. ఈ మేరకు సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం అల్లు అర్జున్ కాకుండా ఆయన టీంను తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక అలా మొత్తం మూడున్నర గంటల పాటు సాగిన ఈ విచారణ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనే విషయాలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
మూడేళ్ల కల.. బూడిదలో పోసిన పన్నీర్ అయ్యిందా..?
అల్లు అర్జున్, సుకుమార్(Sukumar) కాంబినేషన్లో 2021లో వచ్చిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ పాపులారిటీ అందుకుంది. అంతేకాదు ఈ సినిమాలో బన్నీ పర్ఫామెన్స్ కి జాతీయ అవార్డు కూడా లభించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. అలా మూడు సంవత్సరాల పాటు నిర్విరామంగా ఈ సినిమా కోసం పనిచేశారు బన్నీ. ఇక ఎట్టకేలకు డిసెంబర్ 5వ తేదీన సినిమాను విడుదల చేయడం జరిగింది. సినిమా ఊహించినట్టే కలెక్షన్ల సునామి కురిపిస్తోంది. కేవలం 15 రోజుల్లోనే రూ.1600 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ విజయం కోసం మూడేళ్ల పాటు కలలు కన్న అల్లు అర్జున్ కి మాత్రం నిరాశే మిగిలింది. ఈ సినిమాతో మరో జాతీయ అవార్డు అందుకోవాలని కలలు కన్న అల్లు అర్జున్ తాను చేసిన చిన్న తప్పిదం వల్లే తన శ్రమ అంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీర్ అయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.