Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించి దానికి అధినేతగా కొనసాగుతున్నారు. ఎన్ని విమర్శలు, ఎన్ని అవమానాలు..ఇవేమి పట్టించుకోకుండా తన పంథాలో తాను సాగిపోతున్నారు. అయితే చిరు జీవితంలో చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టి.. రాజకీయాల్లోకి రావడం మాత్రమే. ఈ విషయాన్నీ ఆయన ఎన్నోసార్లు మీడియా ముందు నిర్మొహమాటంగా చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి వెళ్లి.. కొన్నేళ్ళకే మళ్లీ వెనక్కి వచ్చేసి తనకు నచ్చిన సినిమాలనే చేసుకుంటూ వస్తున్నారు.
ఇక అన్న అడుగుజాడల్లోనే నడుస్తూ జనసేన పార్టీ పెట్టి ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన గురించి మాట్లాడాల్సివచ్చిన ప్రతిసారి చిరు.. తన రాజకీయ జీవితం గురించి మాట్లాడతారు. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలోపాల్గొని.. రాజకీయాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“ఎంతో మంచి చేయాలనీ నేను కూడా రాజకీయ పార్టీని స్థాపించాను. కానీ, ఇప్పుడున్న రాజకీయాలకు నాలాంటివాడు అనర్హుడు. అది ముమ్మూటికీ వాస్తవం.. అందుకే నేను వెనక్కి వచ్చేసాను. రాజకీయాల నుంచి తిరిగివచ్చాక అభిమానులు నన్ను స్వీకరిస్తారా.. ? లేదా అనే అనుమానం ఉండేది. కానీ, ప్రేక్షకాభిమానులు మాత్రం నాపై అదే అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇక నుంచి బతికింతకాలం సినిమాలే చేస్తాను” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం చిరు చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. విశ్వంభర సెట్స్ మీద ఉండగా.. మరో రెండు సినిమాలు లైనప్ లో ఉన్నాయి.