Tollywood Comedian: ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా పేరు సొంతం చేసుకొని, ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు ప్రముఖ కమెడియన్ బబ్లూ (Babloo). తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయనది చిన్నపిల్లల మనస్తత్వం. తన నటనతో అటు చిన్న పిల్లల్ని కూడా మెప్పించారు. ముఖ్యంగా బబ్లూ తన క్యారెక్టర్ లో కి ప్రవేశించాడు అంటే ఎంతటి వారికైనా సరే ముఖం మీద నవ్వు పూయాల్సిందే. అంతలా తన కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఈయన , తనకు ఎదురైన దుర్ఘటనల వల్ల ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బబ్లూ తనకు ఎదురైన సమస్యల గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు.
చిత్రం సినిమాతో భారీ గుర్తింపు..
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ (Uday Kiran) హీరోగా నటించిన ‘చిత్రం’ సినిమాతో భారీగా ఫేమస్ సంపాదించుకున్నారు బబ్లూ. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించాడు. నిజానికి బబ్లూ అసలు పేరు సదానంద్ (Sadanand) ఈ పేరు ఎవరికి తెలియదని, ఒక్కోసారి తానే తన పేరు కూడా మర్చిపోయేంతగా బబ్లూ అనే పేరు ఫేమస్ అయిపోయిందని తెలిపారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేశాడు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు మళ్ళీ ఆయన ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇక ఆయన గురించి మీడియాలో కూడా ఎక్కడా వార్తలు వచ్చిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బబ్లూ అభిమానులకు టచ్ లోకి వచ్చి పలు విషయాలను పంచుకున్నారు.
కుటుంబ సభ్యులను కోల్పోవడం వల్లే ఇండస్ట్రీకి దూరం..
ఇంటర్వ్యూలో బబ్లూ మాట్లాడుతూ.. “నేను ‘ముద్దుల మేనల్లుడు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యాను. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేశాను జంధ్యాల గారి పోపులపెట్టే అనే సినిమాలో కూడా నటించాను. అందులో నా పాత్ర పేరు బబ్లూ. అదే బబ్లూ పేరు ప్రతి సినిమాలో కూడా వాడుతూ వచ్చాను. టీనేజ్ కి వచ్చిన తర్వాత నేను చిత్రం సినిమా చేశాను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాలలో అవకాశం వచ్చింది. ఇక దాంతో నటుడిగా బిజీ అయిపోయాను. జీవితం కూడా సంతోషంగా సాగిపోతోంది. సరిగ్గా అదే సమయంలో నా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిని కోల్పోవడం నేను చూశాను. ఆ సమయంలో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి, ఇంట్లో నుంచి బయటకు రావడమే మానేశాను. దాంతో సినిమాలకు దూరం అయ్యాను. ఇక ఇండస్ట్రీలో ఎవరితో కూడా నేను టచ్ లో లేను. ఆ తర్వాత సినిమాలు చేయాలనిపించినా.. నాకు అవకాశాలు రాలేదు. ఇప్పటికీ ఏ చిన్న పాత్రలోనైనా అవకాశం వస్తే మళ్లీ నటించి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను” అంటూ బబ్లూ చెబుతున్నారు. మొత్తానికైతే బబ్లు, కుటుంబ సభ్యులను కోల్పోయి నరకం అనుభవించాడని ఆ నరకం వల్లే ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారని తెలుస్తోంది.మరి ఇంత గొప్ప నటుడికి మళ్లీ దర్శకులు అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.