Christmas 2024 : సాధారణంగా పండగలప్పుడు థియేటర్ల వద్ద సినిమాల జాతర ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా సంక్రాంతి, దసరాకి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఆ హడావుడి క్రిస్మస్ కే కనిపిస్తోంది. క్రిస్మస్ కానుకగా ఏకంగా ఈ వారం నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుండడం విశేషం. అల్లరి నరేష్ ‘బచ్చలమల్లి’, ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ వంటి తెలుగు సినిమాలతో పాటు విజయ్ సేతుపతి ‘విడుదల 2’, ఉపేంద్ర ‘యుఐ’ వంటి డబ్బింగ్ చిత్రాలు కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. నిజానికి ప్రస్తుతం పుష్పరాజ్ హవ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత పది రోజుల నుంచి ‘పుష్ప 2’ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి, ఇంకా తన హవా చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ కు సిద్ధం అవ్వడం విశేషం.
బచ్చలపల్లి (Bachhala Nalli)
అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బచ్చలపల్లి’. ఈ సినిమాకు సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించారు. ‘హనుమాన్’ మూవీ హీరోయిన్ అమృత అయ్యర్ ‘బచ్చలపల్లి’ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ‘బచ్చలమల్లి’ మూవీ ఈనెల 20న రిలీజ్ కాబోతోంది.
సారంగపాణి జాతకం (Sarangapani Jathakam)
ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. అయితే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టకపోవడంతో అసలు ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అన్నట్టుగా ఉంది పరిస్థితి. అలాగే క్రిస్మస్ కానుకగా రావాల్సిన ‘రాబిన్ హుడ్’ మూవీ వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
విడుదల 2 (Vidudala 2)
రీసెంట్ గా ‘మహారాజా’ మూవీతో అద్భుతమైన బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు విజయ్ సేతుపతి. ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘విడుదల పార్ట్-2’. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించిన ‘విడుదల’ మూవీకి సీక్వెల్. ఈ మూవీ తమిళం తో పాటు తెలుగులో కూడా ఈనెల 20న థియేటర్లలోకి రాబోతోంది.
యుఐ (UI)
కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన వినూత్నమైన ఫాంటసీ యాక్షన్ చిత్రం ‘యుఐ’. ఈ మూవీ టైటిల్ తోనే ఉపేంద్ర అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఇక ఉపేంద్ర తెలుగులోనూ ఈ సినిమాకు సంబంధించి భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. ఈ మూవీ కూడా డిసెంబర్ 20నే థియేటర్లలోకి రాబోతుండడం విశేషం. మరి ఇన్ని సినిమాలలో క్రిస్మస్ విజేతగా నిలిచేది ఎవరో చూడాలి. మరోవైపు ‘పుష్ప 2’ ఫీవర్ లో ఉన్న ప్రేక్షకులు అసలు ఈ సినిమాలను ఎంతవరకు పట్టించుకుంటారు అనేది సస్పెన్స్ గా మారింది.