Telugu Cinema :సంధ్య థియేటర్ ఘటన అటు సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప 2’ సినిమాకు సంబంధించి డిసెంబర్ 4వ తేదీన బెనిఫిట్ షో వేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా రావడంతో.. అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి మరణించగా.. ఆమె కొడుకు శ్రీ తేజ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై సీరియస్ అయిన తెలంగాణ సర్కార్, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్ ధరల పెంపు ఉండదని, షాకింగ్ కామెంట్లు చేశారు. దీంతో సినీ సెలబ్రిటీలు, దర్శకులు, నిర్మాతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలిసి తమ సమస్యను వెల్లబుచ్చుకోవడానికి సినీ పెద్దలంతా బయలుదేరిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రిని కలిసిన సినీ పెద్దలు..
ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నేతృత్వంలో మొత్తం 36 మంది సభ్యుల బృందం సమావేశం అయ్యింది. హీరోలు వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, శివ బాలాజీ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, బాబీ, వంశీ తదితరులు కలిశారు. అలాగే నిర్మాతలుగా సురేష్ బాబు, నాగవంశీ, సునీల్ నారంగ్, సుప్రియ తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది.
సినీ ప్రముఖుల ప్రతిపాదనలకు సీఎం గ్రీన్ సిగ్నల్..
సినీ ప్రముఖులంతా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ ప్రతిపాదనలు వెల్లబుచ్చుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రతిపాదనను ముఖ్యమంత్రి ముందు పెట్టినట్లు తెలుస్తోంది. అందులో బెనిఫిట్ షో మినహా మిగతా అన్నింటికీ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ప్రతిపాదనలు వెల్లబుచ్చుకున్న సినీ ప్రముఖులు..
దర్శకుడు రాఘవేంద్రరావు..
దిల్ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నాము.. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది.. ముఖ్యంగా తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయి. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ను హైదరాబాద్‌లో చేశారు..ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నాం..
హీరో నాగార్జున..
యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలి..ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే..సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది.హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక..
నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి..
నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను.. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు..హైదరాబాద్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలి.
మురళీమోహన్..
సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది.
సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల..ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నాం..
ఇక చివరిగా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని తమ ప్రతిపాదనను సీఎం ముందు పెట్టగా సీఎం తన నిర్ణయాన్ని ఇలా వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
బెనిఫిట్ షో విషయంలో జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని.. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అంతేకాదు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చిచెప్పారు.