Daaku Maharaj Trailer launch:నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) గత ఏడాది సంక్రాంతి బరిలోకి వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.. ఆ తర్వాత అదే ఏడాది ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.. అయితే ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరుగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం చేస్తూ ఇండియా, యుఎస్ఏ లో వేరువేరుగా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్.
డల్లాస్ లో థియేటర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్..
ఇక అందులో భాగంగానే.. ఈరోజు అమెరికాలోని డల్లాస్ లో ఈ సినిమా థియేటర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి, అక్కడ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అందులో భాగంగానే ఇప్పటికే అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున జై బాలయ్య అంటూ ఫ్లకార్డులు పట్టుకొని కార్లలో ర్యాలీ చేస్తూ.. రోడ్డు షో నిర్వహించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీనికి తోడు బాలయ్య కూడా ఇప్పటికే డల్లాస్ చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం జనవరి 4 అనగా ఈరోజు రాత్రి 9:09 గంటలకు థియేటర్లో ట్రైలర్ లాంచ్ జరగబోతోంది.
ఇండియాలో ఎప్పుడంటే..?
ఇక ఇండియా కాలమానం ప్రకారం రేపు అనగా జనవరి 5వ తేదీన ఉదయం 8:39 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ విషయం పోస్టర్ తో సహా వెల్లడించడంతో అభిమానులు సైతం ఈ ట్రైలర్ కోసం పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్ , టీజర్, గ్లింప్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ మూడవ పాటగా వచ్చిన దబిడి దిబిడి అనే సాంగ్ మాత్రం విమర్శలను ఎదుర్కొంటుంది. ఇటీవల ఈ సినిమా లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయగా.. ఈ స్పెషల్ సాంగ్స్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా డాన్స్ చేసింది. ఈమె తన అంద చందాలతో, గ్లామర్ తో, డాన్స్ స్టెప్పులతో యువతను ఉర్రూతలూగించింది. కానీ ఈమె డాన్స్ స్పీడ్ కి బాలకృష్ణ మ్యాచ్ చేయలేకపోయారు. దీనికి తోడు శేఖర్ మాస్టర్(Sekhar master) కంపోజ్ చేసిన ఈ పాట ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోతోంది. అసలు బాలయ్య డాన్స్ చేస్తుంటే బట్టలు ఉతికినట్టు ఉంది అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్స్. ఇక మరొకవైపు ఈ సినిమాకి ఇన్సైడ్ యావరేజ్ టాక్ వినిపిస్తూ ఉండడం గమనార్హం. మరి ఇన్ని నెగిటివ్ల మధ్య బాలయ్య డాకు మహారాజ్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే జనవరి 12 వరకు ఎదురు చూడాల్సిందే.