Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా తన నటన సామర్థ్యంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ సినిమా అవకాశాలను అందుకొని నేడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వారిలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఒకరు. కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఇబ్బందులను ఎదుర్కొన్న ఈయన నటనపరంగా తనని తాను నిరూపించుకుంటూ నేడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు. అయితే చిరంజీవిలాంటి ఒక గొప్ప నటుడిని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు (Dasari Narayanarao)రిజెక్ట్ చేశారని తాజాగా డైరెక్టర్ ధవళ సత్యం (Dhavala Satyam)ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
జాతర…
ప్రముఖ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారి వద్ద ఎంతోమంది శిష్యరికం నేర్చుకున్న విషయం తెలిసిందే. అలా ఆయన వద్ద శిష్యుడిగా ఉన్న వారిలో ధవళ సత్యం ఒకరు. ఈయన దాసరి నారాయణ రావుగారు దర్శకత్వం వహించిన శివరంజని, రంగూన్ రౌడీ వంటి సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా ఏడాది పాటు పనిచేశారు. ఇలా ఏడాది తర్వాత ధవళ సత్యం జాతర(Jathara) అనే సినిమాకు దర్శకుడిగా మారారు. అయితే ఈ సినిమా కోసం అందరూ కూడా కొత్త వాళ్లే పని చేశారని, ఒక ఇంటర్వ్యూ సందర్భంగా డైరెక్టర్ సత్యం వెల్లడించారు.
చిరంజీవిని వద్దు…
డైరెక్టర్ నుంచి మొదలుకొని ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ అందరూ కూడా కొత్త వాళ్లే. ఇక హీరోని కూడా కొత్త వాళ్ళని తీసుకుందామని నేను చిరంజీవిని ఎంపిక చేశాను. ఇక గురువుగారి వద్దకు వెళ్లి ఈ విషయం చెబితే ఫస్ట్ ఈ సినిమా నుంచి చిరంజీవిని తప్పించమని చెప్పారు. ఈ సినిమాకు కొత్త వాళ్ళని హీరోగా పెట్టుకోవడం ఏంటి కొంచెం మంచి హీరోని పెట్టుకో అంటూ నాకు సలహా ఇచ్చారు. నేను మాత్రం చిరంజీవిని తీసుకుంటానని చెబితే అతనిలో నీకేం నచ్చింది అంటూ నన్ను అడిగారు .అతని ఫేస్‌లో, లుక్స్‌లో నాకు ఫ్లేర్ కనిపించేది అతను గొప్పోడు అవుతాడని గురువుగారికి చెప్పాను.
గురువుగారు ఈ సినిమాలో చిరంజీవి వద్దని చెప్పినా నేను మాత్రం చిరంజీవిని సెలెక్ట్ చేశానని ధవళ సత్యం తెలిపారు. అయితే చిరంజీవిని నేను ఈ సినిమాలో తీసుకోవడానికి ఒకటే ప్రధాన కారణం. గురువుగారు దర్శకత్వం వహించిన శివరంజని సినిమా ఆడిషన్స్ కు చిరంజీవి కూడా వచ్చారు. ఆయన ఆడిషన్ చూసిన నేను అతనిని సెలెక్ట్ చేస్తారనుకున్నాను కానీ గురువుగారు రిజెక్ట్ చేశారు. ఇలా రిజెక్ట్ చేయడంతో చిరంజీవి బయట బాధపడుతూ కూర్చున్నారు. నేను వెళ్లి నువ్వేం బాధపడొద్దు నేను ఎప్పటికైనా డైరెక్టర్ అవుతాను, నా మొదటి సినిమా హీరో నువ్వే అంటూ అతనికి మాట ఇచ్చాను. ఆ సమయంలో చిరంజీవి నాకు హీరోలు, పెద్దపెద్ద పాత్రలేమి వద్దు సినిమాలో నటించడానికి నాలుగైదు సీన్లు ఇవ్వండి చాలు అంటూ బ్రతిమాలాడు. నీకు సినిమాలో ఇస్తే హీరోగానే ఛాన్స్ ఇస్తాను అంటూ ఆరోజు మాట ఇవ్వటం వల్లే జాతర సినిమాలో చిరంజీవిని హీరోగా ఎంపిక చేసుకున్నాను అంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ ధవళ సత్యం చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.