Telangana : బక్రీద్‌కు ముందు తెలంగాణలో గోవధపై పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది. గోవుల అక్రమ రవాణా, బలవంతంగా ఆవులను కబేళాలకు తరలిస్తున్నారంటూ గో సంరక్షకా దళాలు రచ్చ చేస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎప్పటిలానే సీన్‌లోని వచ్చారు. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ఆదేశించారు.
50 ఎకరాలకు తగ్గకుండా..
గోవుల సంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేలా.. విశాలంగా గోశాలల ఏర్పాటు ఉండాలన్నారు ముఖ్యమంత్రి. మొదటిదశలో తెలంగాణలోని వెటర్నరీ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, దేవాలయాలు, కాలేజీలకు చెందిన భూముల్లో గోశాలల నిర్మాణం చేపట్టాలని సూచించారు. కనీసం 50 ఎకరాలకు తగ్గకుండా.. అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని ఆదేశించారు.
ఆధునిక సౌకర్యాలతో..
ఇరుకు స్థలాల్లో, బంధించినట్టుగా కాకుండా.. గోవులు మేత మేసేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు, బడ్జెట్ అంచనాలు సిద్ధం చేయాలన్నారు. నిర్వహణ, సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
సరికొత్త డిజైన్
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు సీఎం రేవంత్‌రెడ్డి. షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో పలు మార్పులు చెప్పారు. నాలుగైదు రోజుల్లోగా తుది మోడల్‌ను ఖరారు చేయనుంది సర్కారు.