Deepika Padukone.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ సినిమాలతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin). ఈ ఏడాది కల్కి 2898AD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దీపికా పదుకొనే(Deepika Padukone), అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమలహాసన్(Kamal Hassan), రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) లాంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో కొన్ని ప్రశ్నలు అలాగే వదిలేశారు. దీంతో ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కోసం సీక్వెల్ ఎప్పుడు వస్తుందని అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
కల్కి 2 స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో పడ్డ నాగ్ అశ్విన్..
ముఖ్యంగా మహాభారతం, కల్కి అవతారం నేపథ్యంలో కల్పిత కథను వెండితెరపై ఆవిష్కరించారు. క్లైమాక్స్ లో ప్రభాస్ ని కర్ణుడిగా చూపించడం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. విజువల్స్ కూడా హాలీవుడ్ స్థాయిలో మెప్పించాయి. అటు ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది ఈ సినిమా. ఇక ఇప్పుడు రెండవ పార్ట్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నారు మేకర్స్. కానీ ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం తెలియదు. కానీ నాగ్ అశ్విన్ (Nag Ashwin) మాత్రం కల్కి2 స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పనిలో పడినట్లు సమాచారం. ఇక ఆయన కల్కి2 కంప్లీట్ అయ్యేవరకు మరో ప్రాజెక్ట్ చేయనని కూడా స్పష్టం చేశారు. ఒకరకంగా చెప్పాలి అంటే ప్రభాస్ కి ‘బాహుబలి’ తరువాత అతిపెద్ద విజయం అందించిన చిత్రం ఇదే అని చెప్పడంలో సందేహం లేదు. అందుకే పార్ట్ 1కి మించి ఉండేలా పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారు నాగ్ అశ్విన్.
కల్కి 2 ఫస్ట్ ప్రయారిటీ కాదు – దీపిక
ఇకపోతే పార్ట్ 1 లో దీపికా పదుకొనే(Deepika Padukone) పాత్ర అంతంత మాత్రమే ఉంటుంది. కానీ ఆమె పాత్ర సీక్వెల్ లో అత్యంత కీలకమని అందరూ భావించారు. అయితే ఇలాంటి సమయంలో దీపికా పదుకొనే కల్కి2 పై చేసిన కామెంట్లు అటు ప్రభాస్ అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవలే దీపికా పదుకొనే – రన్వీర్ సింగ్ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత బిడ్డ పుట్టడంతో పాప ఆలనా పాలన చూసుకోవడానికి ఇంటికే పరిమితమైంది. దీపికా సాంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తుందో అందరికీ తెలుసు. అందుకే తన కూతురి పేరు దువా (ప్రార్థన)అని పేరు కూడా పెట్టింది. దీనికి తోడు తమ పాపను అందరికీ పరిచయం చేయడం కోసం గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేసింది ఈ జంట. ఈ మీటింగ్ లో మీడియా ప్రతినిధులు కల్కి2 గురించి అడగ్గా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీపికా మాట్లాడుతూ.. ” నేను కూడా కల్కి 2 కోసం ఎదురు చూస్తున్నాను. కానీ నా ఫస్ట్ ప్రయారిటీ కల్కి కాదు. నా కుమార్తె దువా. ముఖ్యంగా నా కూతుర్ని పెంచడం కోసం నేను ఆయాను నియమించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నన్ను మా అమ్మ ఎలా అయితే పెంచిందో.. నేను కూడా నా కూతుర్ని అలాగే దగ్గరుండి పెంచాలని భావిస్తున్నాను” అంటూ తెలిపింది దీపిక. దీంతో కల్కి 2 కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు మాత్రం ఈ వార్త కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే నాగ్ అశ్విన్ కల్కి 2 సినిమా పట్టాలెక్కించడానికి సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు కూతురితో అలనా పాలన ముచ్చట మొత్తం తీర్చేసుకుని, మళ్లీ సినిమా షూటింగ్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.