Dhanush vs Nayanthara: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara)పై సివిల్ కేసు నమోదు అవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన పర్మిషన్ లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా విజువల్స్ ను నెట్ ఫ్లిక్స్ (Netflix) రూపొందించిన “నయనతార:బియాండ్ ది ఫెయిరీ టేల్” డాక్యుమెంటరీలో ఉపయోగించుకోవడంతో స్టార్ హీరో ధనుష్ (Dhanush) నయనతారపై కేసు పెట్టారు. నయనతారతో పాటు ఆమె భర్త ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ (Vighnesh Shivan), తమ నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై కూడా మద్రాస్ హైకోర్టులో కేసు నమోదు చేయగా.. ధనుష్ పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం కూడా విచారణకు అంగీకరించినట్లు తెలిసింది.
నయనతార పై సివిల్ కేస్..
అసలు విషయంలోకి వెళితే.. తాజాగా నయనతారకు సంబంధించి.. నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తయారు చేసింది. ఈ డాక్యుమెంటరీ విషయంలోనే నయనతార కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మధ్య వివాదం మొదలైంది. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో చూపించాలని అనుకుంది నయనతార. అయితే ఆ చిత్రం నిర్మాత ధనుష్ అందుకు ఒప్పుకోలేదు. దాదాపు రెండేళ్ళు ఆయన చుట్టూ తిరుగుతూ.. ఎన్వోసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) కోసం అభ్యర్థించినా.. ఆయన పర్మిషన్ ఇవ్వలేదు.
అసలేం జరిగిందంటే..?
అయితే తప్పని పరిస్థితుల్లో ఆ సినిమాలోని మూడు సెకండ్ల నిడివి ఉన్న ఒక క్లిప్ ను ఆమె వాడుకుంది. ఆ తర్వాత డాక్యుమెంటరీ నుండి ట్రైలర్ విడుదలవ్వగా.. ఆ ట్రైలర్ చూసిన ధనుష్ తన పరిమిషన్ లేకుండా తన సినిమాలోని క్లిప్ వాడుకున్నందుకు రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, నోటీసులు పంపించారు. దీనిపై మండిపడ్డ నయనతార.. బహిరంగంగా మూడు పేజీల లేఖ సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా పోస్ట్ చేసింది. “అందులో ధనుష్ నుంచి పర్మిషన్ రానందుకు తాను ఎంతో బాధపడ్డాను అని, డాక్యుమెంటరీ ట్రైలర్లో మూడు సెకండ్ల సీన్ ను ఉపయోగించినందుకు నష్టపరిహారంగా రూ .10 కోట్లు డిమాండ్ చేస్తారా..? మీరు నాపై ద్వేషం చూపిస్తున్నారు. మీరు, మీ తండ్రి, సోదరుడి సహాయంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ నేను నా రెక్కల కష్టంతో నిలదొక్కుకున్నాను.. కానీ మీరు ఇలా చేయడం వల్ల నా మనసు గాయపడింది” అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది నయనతార.
నయనతారకు పెరుగుతున్న మద్దతు..
ఇకపోతే కోలీవుడ్ లో ఈ వ్యాఖ్యలు కాస్త తీవ్ర చర్చకు దారితీసాయి. పలువురు స్టార్ సెలబ్రిటీలు, పైగా ధనుష్ తో నటించిన ఎంతో మంది హీరోయిన్లు నయనతారకు అండగా నిలిచారు. అంతేకాదు సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ (Radhika Sarath Kumar) కూడా నయనతారకు అండగా నిలిచింది. ఇక నయనతారకు పెరుగుతున్న మద్దతును దృష్టిలో పెట్టుకుకొని.. తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. దంపతులతో పాటు వారి నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ పై కూడా పరువు నష్టం దావా వేశారు ధనుష్. మరి దీనిపై నయనతార రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్..
ఇక డాక్యుమెంటరీ విషయానికి వస్తే.. ఇందులో నయనతార కెరియర్, ఆమె ఎదుర్కొన్న విమర్శలు, పడ్డ అవమానాలను చూపించారు. అలాగే విఘ్నేష్ శివన్ తో ఆమె పరిచయం, ప్రేమ, పెళ్లి వంటి అంశాలను కూడా పొందుపరిచారు. ఇకపోతే నానుమ్ రౌడీ దాన్ సినిమాకి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. తమ కలయికలో వచ్చిన చిత్రం గురించి డాక్యుమెంటరీలో చూపించాలనుకుంది నయనతార. కానీ ఇప్పుడు చిక్కుల్లో పడిందని చెప్పవచ్చు. తాజాగా ధనుష్ చేస్తున్న పనులను బట్టి చూస్తే.. ఆయన ఈ విషయాన్ని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.