AP Heavy Rains: ఏపీకి భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో తాజా పరిస్థితులను ప్రకృతి విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. తాజా పరిస్థితులను వెల్లడించిన ఆయన, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతుందని, ఇది ప్రస్తుతానికి ట్రింకోమలీకి 130 కి.మీ, నాగపట్నానికి 400 కి.మీ,పుదుచ్చేరికి ఆగ్నేయంగా 510కి.మీ మరియు చెన్నైకి ఆగ్నేయంగా 590 కి.మీ. దూరంలో ఉందన్నారు. రానున్న 12గంటల్లో తుపానుగా బలపడనున్నట్లు కూర్మనాథ్ హెచ్చరించారు.
తదుపరి 2 రోజులలో శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు కదులుతూ ఉంటుందని, దీని ప్రభావంతో నేడు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 28 నుండి 30వ తేదీ వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భారీ వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతన్నలకు జాగ్రత్తలు తెలిపారు. రానున్న నాలుగు రోజులు వాతావరణం స్థితిగతులు తెలుసుకొనేందుకు ఈ వెబ్ సైట్ లింక్ ను https://apsdma.ap.gov.in/files/3e7f9efc సంప్రదించాలని ప్రకృతి విపత్తుల సంస్థ తెలిపింది.
ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్ల కు ప్రభుత్వం వర్షసూచనపై ఆదేశాలు జారీ చేసింది. పలు జిల్లాలలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా తెలిపింది. అలాగే వాగులు, వంకల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భారీ నీటి ప్రవాహం సాగే సమయంలో వాగులు, వంకల వైపుకు వెళ్లరాదన్నారు.
Also Read: Balineni Srinivasa Reddy: నన్ను గెలక్కండి.. నేను నోరు తెరిస్తే.. బాలినేని మాస్ వార్నింగ్..
సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే చలిగాలుల ధాటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఏవైనా జ్వర లక్షణాలు ఉంటే స్థానిక వైద్యశాలను సంప్రదించాలని, అలాగే వైద్యసిబ్బంది అవసరమైన ప్రదేశాలలో వైద్యశిబిరాలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది.