Dil Raju Prees Meet : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు (Dilraju), ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan)తో గేమ్ ఛేంజర్ (Game Changer), వెంకటేష్(Venkatesh) తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నాయి. ఇదిలా ఉండగా రామ్ చరణ్ హీరోగా, శంకర్ (Shankar) డైరెక్షన్లో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 4వ తేదీన రాజమండ్రిలో చాలా ఘనంగా నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడిన దిల్ రాజు పలు ఊహించని కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఫలితం ఎలా ఉన్నా సరే కచ్చితంగా సంక్రాంతి తర్వాత మరో దిల్ రాజుని చూస్తారు అని కామెంట్స్ చేసారు.
దిల్ రాజు మాట్లాడుతూ..” రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నా జీవితంలోనే ఒక అద్భుతమైన ఈవెంట్. ముఖ్యంగా ఈవెంట్ సక్సెస్ కావడానికి కారణమైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. సంక్రాంతికి వస్తున్న చిత్రాలకి ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరలు పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ నాకు ఎంతో సహకారాన్ని అందించారు. సినిమా టికెట్ ధరలు పెంచినందుకు ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ సినిమా కోసం మూడున్నర సంవత్సరాలు కష్టపడ్డాము. ఎన్నో ఒడిదుడుకులు కూడా చూసాము. కోవిడ్ వల్ల వకీల్ సాబ్ ఆలస్యమైంది. కోవిడ్ తో ఇంకెన్నో సమస్యలు ఎదుర్కొన్నాము. వకీల్ సాబ్ తో డిసప్పాయింట్మెంట్ కారణంగా నెల రోజులు నేను అమెరికాకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత నా మనవడు ఫోన్ చేసి నాకు బాధపడకు అని చెప్పాడు.
గేమ్ ఛేంజర్ తప్పకుండా హిట్ కొడతావని నా మనవడు ఆర్నాన్ష్ నాకు ధైర్యం చెప్పడంతో నిజంగానే నాకు ధైర్యం కలిగింది. నా జడ్జిమెంట్ పై నమ్మకం పోయిందనే భయం ఏర్పడింది. నా క్లోజ్ డైరెక్టర్లతో మాట్లాడి నేను లోపాల గురించి అడిగి మరీ తెలుసుకునే వాడిని. ఇక మా శిరీష్ కూడా నన్ను ఓవర్ లోడ్ అవుతున్నావు. శ్రద్ధ పెట్టలేకపోతున్నావు అని సూచించేవాడు. అయితే మరొకవైపు శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ 2 రిలీజ్ ప్రతికూలంగా రావడంతోనే ఆ ప్రభావం గేమ్ ఛేంజర్ పై పడింది. ఇక శంకర్ సినిమా కూడా పోయింది. దిల్ రాజు జడ్జిమెంట్ బాగాలేదు అనే విమర్శలు కూడా ఎన్నో వచ్చాయి. అందుకే శంకర్ తో మరొకసారి మాట్లాడి మీరు చెప్పిన కథను మళ్ళీ చెక్ చేయమని చెప్పాను. గేమ్ ఛేంజర్ నా కం బ్యాక్ మూవీ. కచ్చితంగా రిజల్ట్స్ కొట్టే మూవీ.. చిరంజీవి గారు శంకర్ సినిమాల గురించి చెబుతూ రెస్పెక్ట్ ఫిలిం గేమ్ ఛేంజర్ అని చెప్పడం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇక ఈ సినిమాలోని పాటల కోసం రూ.75 కోట్లు పెట్టాము.
అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగానే సూపర్ హిట్ అవుతుంది. సంక్రాంతికి దిల్ రాజు కం బ్యాక్ అని తప్పకుండా అంటారు. సంక్రాంతి తర్వాత ఒరిజినల్ దిల్ రాజుని మీరు చూస్తారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై తెలంగాణ సీఎంను కలిసి విజ్ఞప్తి చేశాను. ఇక ఆయనదే తుది నిర్ణయం . నిర్మాతగా నేను ప్రయత్నం చేస్తా. ఫలితం ఎలా వచ్చినా సరే తీసుకుంటాను” అంటూ దిల్ రాజు తెలిపారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.