IT Raids in Tollywood :గత మూడు రోజులుగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నివాసం, ఆఫీస్ లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఐటీ శాఖ అధికారులకు సంబంధించిన వెహికల్ లోనే దిల్ రాజు తల్లిని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు ఫ్యామిలీ మెంబర్స్. ముఖ్యంగా దిల్ రాజు తల్లి వెంట కుటుంబ సభ్యులతో పాటు ఐటీ శాఖకు చెందిన ఒక మహిళా అధికారి కూడా హాస్పిటల్ కి వెళ్లారు. మిగిలిన అధికారులు మాత్రం ఇక్కడ దిల్ రాజు ఇంట్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ దిల్ రాజు తల్లికి ఏమైంది? అసలు ప్రస్తుత ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటి? అంటూ సోషల్ మీడియాలో వరుస పోస్ట్ లు పెడుతున్నారు.
గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు..
ఇక అసలు విషయంలోకెళితే.. గత మూడు రోజులుగా నిర్మాత దిల్ రాజు (Dilraju ) , డైరెక్టర్ సుకుమార్ (Sukumar), మైత్రి మూవీ మేకర్స్ నివాసాలలో, ఆఫీసులలో, బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 200 మంది ఐటి అధికారులు రంగంలోకి దిగి సినిమాలకు పెట్టిన బడ్జెట్ ఎంత? వచ్చిన కలెక్షన్లు ఎంత? అసలు ఆ డబ్బులకు వీరు కడుతున్న టాక్స్ లెక్కల మాటేంటి? ఇలా పలు అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీరు చూపించిన పోస్టర్లే ఇప్పుడు వీళ్ళ తలలకు చుట్టుకుంటున్నాయని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు . ఈసారి సంక్రాంతి సందర్భంగా ముగ్గురు బడా హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అందులో మొదటిది ‘గేమ్ ఛేంజర్’ రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా జనవరి 10వ తేదీన విడుదలైంది. మొదటి రోజే రూ.186 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి అని పోస్టర్స్ రివీల్ చేశారు మేకర్స్. సినిమా డిజాస్టర్ గా నిలిచినా.. కలెక్షన్లు జోరుగా వచ్చినట్లు చూపించారు. దీనికి తోడు దిల్ రాజు నిర్మించిన మరో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం. ఇది కూడా తక్కువ సమయంలోనే రూ .200 కోట్ల క్లబ్లో చేరిపోయిందని పోస్టర్లు దర్శనమిచ్చాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇవన్నీ నిజమైన లెక్కలేనా? వచ్చి ఉంటే ఆ డబ్బంతా ఎక్కడ ఉంది ? దీనికి సరిపడా టాక్స్ కడుతున్నారా ?అనే అంశాలపై ఆరాతీస్తున్నారు. ఏది ఏమైనా పోస్టర్లు ఇప్పుడు వీరి మెడకు చుట్టుకుంటున్నాయి.. ఇక త్వరలోనే నిజానిజాలు తేలనున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురవడంతో పలువురు ఇండస్ట్రీ సెలబ్రిటీలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇక త్వరలోనే ఆమె ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా వైద్యులు తెలియజేయనున్నట్లు తెలుస్తోంది.