Dimple Hayathi:- కమర్షియల్ డైరెక్టర్‌గా పేరున్న హరీష్ శంకర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆయన డైరెక్ట్ చేసిన గద్దలకొండ గణేష్ చిత్రంలో వరుణ్ తేజ్, అధర్వ మురళి హీరోలుగా నటించారు. మృణాళిని రవి, పూజా హెగ్డేలు కథానాయికలుగా నటించారు. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది బ్యూటీ డింపుల్ హయాతి. హీరోయిన్‌గా నటించాల్సిన ఆమె అనుకోని కారణాలతో స్పెషల్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది. అలా జరగటానికి గల కారణాన్ని ఆమె రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
‘‘ ఓ పెద్ద సినిమా నిర్మాతలు వారి సినిమాలో నన్ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు మూడు పెద్ద సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. అయితే డేట్స్ ప్రాబ్లమ్ కాకూడదని భావించి నేను ఆ సినిమాలను ఒప్పుకోలేదు. అందుకు కారణం చేస్తున్న సినిమాపై ఉన్న నమ్మకమే. అలా నా తలుపు కొట్టిన అవకాశం గద్దలకొండ గణేష్. ముందుగా నన్నే హీరోయిన్ అనుకున్నారు. కానీ నేను చేయలేనని చెప్పేశాను. తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ 90 శాతం షూటింగ్ అయిన తర్వాత నేను చేస్తోన్న సినిమా ఆగిపోయింది. దాంతో చాలా బాధ వేసింది.
అలా బాధపడుతున్న సమయంలో హరీష్ శంకర్ ఫోన్ చేసి బాధపడవద్దని అన్నారు. గద్దలకొండ గణేష్‌లో ఓ సాంగ్ చేయమని అడిగారు. నేను ఆ విషయాన్ని నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి చెప్పాను. అందరూ స్పెషల్ సాంగ్ చేయవద్దనే అన్నారు. అందుకు కారణం.. అలా చేస్తే హీరోయిన్‌గా తర్వాత అవకాశాలు రావని అన్నారు. కానీ లోపల ఓ గట్ ఫీలింగ్‌తో హరీష్ శంకర్ గారి సినిమాలో సాంగ్ చేశాను’’ అన్నారు డింపుల్ హయాతి. తర్వాత ఆమె ఖిలాఢి, రీసెంట్‌గా రిలీజైన రామ బాణం చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించింది.