Telangana Political News(CM KCR Latest News): మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరుతారంటూ ప్రచారం జరిగింది. ఔరంగాబాద్‌లో జరిగిన పార్టీ సభలో వేదికపై ప్రత్యక్షమవడంతో.. ఇక గులాబీ కండువా కప్పుకోవడం కన్ఫామ్ అనుకున్నారంతా. కానీ, సలహాదారు పదవితోనే సరిపెట్టారు సీఎం కేసీఆర్. కేబినెట్ హోదాతో ఇమేజ్ పెంచేశారు. ఇంతకీ సోమేశ్ రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు? బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ పనులు ఎందుకు చక్కబెట్టలేదు?
మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ అనే కాదు.. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి విషయంలోనూ ఇలానే జరిగింది. ఓ కార్యక్రమంలో సీఎం కేసీఆరే ఆయన్ను తెగ పొగిడేశారు. త్వరలోనే మహేందర్ రెడ్డి రిటైర్ అవుతారని.. ఆయన్ను అంత ఈజీగా వదిలిపెడతామా? ఆయన సేవలు వాడుకుంటామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, డీజీపీగా పదవీ విరమణ చేయగానే మహేందర్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతారని అన్నారు. ఫలానా చోటినుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ, రిటైర్ అయినప్పటి నుంచీ ఆయన అడ్రస్ లేరు. బీఆర్ఎస్‌లో చేరలేదు.. అలాగని ఏ సలహాదారు పదవి కూడా తీసుకోలేదు. ప్రస్తుతానికి కంప్లీట్ ఆఫ్‌లైన్ అయిపోయారు మహేందర్‌రెడ్డి.
ఎందుకలా? స్వయంగా కేసీఆరే ఇంట్రెస్ట్ చూపించినా.. ఆ ఇద్దరు మాజీలు గులాబీ కండువా కప్పుకునేందుకు ఎందుకు నిరాకరించారు? మహేందర్‌రెడ్డి సేవలను మరింత కాలం వాడుకుంటామని ముఖ్యమంత్రే చెప్పినా.. ఆయన ఇంతవరకూ ఎందుకు న్యూస్‌లో లేకుండా పోయారు? మహారాష్ట్ర బీఆర్ఎస్ మీటింగ్ వేదికపై కనిపించిన సోమేశ్ కుమార్.. కారెక్కడానికి మాత్రం ఎందుకు ఆసక్తి చూపలేదు? అనే చర్చ నడుస్తోంది.
సీఎస్‌గా ఈయన, డీజీపీగా ఆయన.. సీఎం కేసీఆర్ వ్యవహార శైలిని అత్యంత దగ్గరగా చూసిన అధికారులు. గులాబీ బాస్‌తో ఎట్లుంటదో అందరికంటే వారికే ఎక్కువ తెలుసు. అందుకే, కేసీఆర్‌తో కలిసి రాజకీయ ప్రయాణం చేసేందుకు వారిద్దరు భయపడ్డారని.. ఎందుకొచ్చిన రిస్క్ అనుకుని.. కారెక్కకుండానే కామ్ అయిపోయారని అంటున్నారు. మహేందర్‌రెడ్డి కాస్త స్మూత్ కావడంతో.. ఇన్నాళ్లు భరించింది చాలు, ఇక వద్దనుకుని.. ఆయనకు అందనంత దూరంగా ఉండిపోయారని చెబుతున్నారు. సోమేశ్ కుమార్ మహా ముదురు కావడంతో.. ఆయన రాజకీయాల్లోకే వస్తారని అనుకున్నా.. ఏం జరిగిందో ఏమో.. ముఖ్యమంత్రికి ముఖ్యసలహాదారు పదవితోనే సరిపెట్టుకున్నారని సమాచారం.