Dimple Hayathi : టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి (Dimple Hayathi) గత కొన్నాళ్ల నుంచి అనారోగ్యం కారణంగా రెస్ట్ తీసుకుంటుంది. తాజాగా ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తనకు ఒక మేజర్ సర్జరీ జరిగిందని, దానివల్ల 30 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నాను అంటూ రాస్కొచ్చింది. ఇప్పుడు తను షేర్ చేసిన ఫోటోలు, వీడియోలలో వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తోంది. ఒక ఫోటోలో మాత్రం ఆస్పత్రి బెడ్ పై ఆమె సెలైన్ తీసుకుంటున్నట్టుగా కన్పించింది.
ఈ సంవత్సరం అంతా తను అనారోగ్యంతో పోరాడుతున్నట్టు తాజాగా షేర్ చేసిన పోస్టులో డింపుల్ హయతి (Dimple Hayathi) వెల్లడించింది. అయితే గత 25 రోజుల నుంచి మళ్లీ తన ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేశానని, కొన్నాళ్ల నుంచి సర్జరీ కోసం తరచుగా ఆసుపత్రికి వెళ్లడం ఒక సవాలుగా మారిందని చెప్పుకొచ్చింది. హార్మోన్ అసమతుల్యత కారణంగా తాను బాగా బరువు పెరిగిపోయానని, దానివల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని వెల్లడించింది డింపుల్ హయాతి.
అయితే ఈ విషయం తెలియక బరువు తగ్గించుకోవడానికి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, వర్కౌట్ పేరుతో శరీరాన్ని ఇబ్బంది పెట్టడంతో భుజం నొప్పి, కాలి నొప్పి, కుడి వైపు నడుము నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యాయట. తాజా పోస్ట్ లో డింపుల్ హయాతి తన ఫిట్నెస్ ట్రైనర్లు కులదీప్ సేథీ, సుమిందర్ సేథీలకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన వెనునొప్పి ఇప్పటికే 70% తగ్గిందని పేర్కొంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ తను ప్రస్తుతం సాధారణ స్థితికి వచ్చానని రాస్కొచ్చింది.
అయితే ఒక నటికి ఇలాంటి విషయాలను బహిరంగంగా చెప్పడానికి ధైర్యం కావాలని, కానీ ఒక అడుగు ముందుకేసి ధైర్యంగా విషయాన్ని బయట పడితే తనలా బాధపడే వారికి కచ్చితంగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను అంటూ అసలు ఏం జరిగిందో చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ లోనే ప్రస్తుతం తాను హెల్దీగా రికవర్ అవుతున్నాను అనే గుడ్ న్యూస్ తో పాటు అభిమానులకు 2025 న్యూ ఇయర్ విష్ చేస్తూ ఆ నోట్ ని పూర్తి చేసింది.
డింపుల్ హయాతి (Dimple Hayathi) సినిమాల విషయానికి వస్తే.. 2017 లో ‘గల్ఫ్’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 2019లో రిలీజ్ అయిన ‘గద్దల కొండ గణేష్’ సినిమాలోని ‘జర్రా జర్రా’ పాటతో పాపులర్ అయింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే తెలుగులో డింపుల్ హయాతికి అవకాశాలు రావడం మొదలైంది. 2021 లో ‘ఆత్రంగి రే’ అనే సినిమాతో హిందీలో అడుగు పెట్టింది. ఈ బ్యూటీ చివరగా 2023లో ‘రామబణం’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ గోపీచంద్ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం డింపుల్ హయాతి నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి అన్నది ఇంకా తెలియ రాలేదు. ఇక ఇప్పుడు ఆమె చేసిన పోస్ట్ ను చూశాక అభిమానులు దింపుల్ కొత్త ఏడాదిని హెల్దీగా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు.