AP DGP Warning : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీంతో.. కాకినాడ పోర్టులో పట్టుపడిన బియ్యం కేసు దగ్గర నుంచే మొత్తం తీగ లాగాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ తీగ లాగితే.. అక్రమ సామ్రాజ్యం డొంక అంతా కదలాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అందుకే.. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు.
రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ పక్కదారి పట్టిందని, అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నేతల ఒత్తిళ్లతో కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూటమి నేతలు ఆగ్రహిస్తున్నారు. నేతలు, అధికారులు తీరు మార్చుకునేందుకు కాస్త సమయం ఇస్తామంటూ ప్రకటించారు. ఈలోపు లోనే క్రమంగా అన్ని వ్యవస్థలపై పట్టు బిగిస్తున్నారు. ఓ వైపు తమదైన మార్కు చూపించేలా పరిపాలించడంతో పాటు మరోవైపు వైసీపీ నేతలు అక్రమాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే పీడీఎస్ అక్రమ రవాణా సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లాలోని ఓ ఎంపీడీవో పై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన డిప్యూటీ సీఎం.. నేరుగా కడప రిమ్స్ లో అధికారిని పరామర్శించేందుకు వెళ్లారు. అక్కడి నుంచే ప్రత్యర్థి పార్టీ స్థానిక నేతలకు వార్నింగ్ ఇస్తూ.. మిగతా వారికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో బడా నేతల అక్రమాలను విడిచిపెట్టేలా కనిపించడం లేదు. అందులో.. తన పార్టీ ముఖ్య నేత పర్యవేక్షణలో ఉన్న పౌరసరఫరాల శాఖలో అవినీతిని పూర్తిగా కట్టడి చేసేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలో కాకినాడ పోర్టు నుంచి బియ్యాన్ని అక్రమంగా ఇతర దేశాలకు తరలిస్తున్నారంటూ.. ద్వారంపూడి చంద్రశేఖర్ ను ఎన్నికల సమయంలో తీవ్రంగా విమర్శించారు. ఆయనతో పాటు అనేక కీలక నేతల పాత్రపైనా అనుమానాలుండడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా విచారణకు సిద్ధమయ్యారు. ఇప్పటికే.. సిట్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇందులో ఎవర్ని నిందితులుగా గుర్తిస్తుందో వేచి చూడాలి.
మరోవైపు.. లీజుకు తీసుకున్న గోడౌన్ లో నిల్వ చేసిన ప్రభుత్వ పీడీఎస్ బియ్యాన్ని మాయం చేశారనే కేసులో పేర్ని నాని, ఆయన సతీమణి బుక్కయ్యారు. వారిపై లీగల్ గా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమంగా బియ్యం సరఫరా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.
Also Read : దాడి చేస్తే తాట తీస్తాం.. వైసీపీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరిక
మరోవైపు.. కూటమి ప్రభుత్వం, నేతలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా పోస్టులు చేస్తున్న వారికీ పోలీసు శాఖ గట్టి హెచ్చరికలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసే వారిని విడిచిపెట్టవద్దని ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎం దగ్గర నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో.. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 572 కేసులు నమోదు చేసినట్లు తెలిపిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు.. 212 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.