Nag Ashwin: సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. ఆకాశమే హద్దు అనేలా ఉంటారు చాలామంది. కానీ నాగ్ అశ్విన్ రూటే సపరేటు. అసలు ఈయన వెయ్యి కోట్ల సినిమా తీసిన దర్శకుడేనా? అనేలా ఉండే నాగ్ అశ్విన్ సంప్లిసిటీకి సలామ్ కొట్టాల్సిందే. కల్కి సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్‌లో పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్‌లో ఎంటర్ అయిన నాగి.. కనీసం పది లక్షలు కూడా విలువ చేయని కార్లు వాడుతుంటాడు. లేటెస్ట్‌గా నాగి మారుతి 800లో కనిపించి.. మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
మారుతి 800 కార్‌లో నాగి
అసలు నాగ్ అశ్విన్ సినిమాలకు, ఆయన జీవన శైలికి సంబంధమే ఉండదు. నాగి తన వ్యక్తిగత జీవితంలో చాలా సింపుల్‌గా ఉంటాడు. ఎక్కడికి వెళ్లినా సరే.. సింపుల్‌గా ఒక టీషర్ట్, సాదా సీదా చెప్పులతో కనిపిస్తుంటాడు. అలాగే.. ఆయన ఒక్కడే వెళ్తుంటాడు. ఆయన చుట్టు పక్కల ఒక దర్శకుడు అనే హడావిడి అస్సలు కనిపించదు. ముఖ్యంగా నాగ్ అశ్విన్ కార్ల గురించి వార్తలు వైరల్ అవుతునే ఉంటాయి. ఒక్క సినిమా హిట్ కొట్టి లక్షలు, కోట్ల రూపాయల కార్లలో తిరుగుతుంటారు దర్శకులు. కానీ నాగి మాత్రం ఐదారు లక్షల కార్‌లోనే తిరుగుతుంటాడు. గత కొన్నేళ్లుగా నాగ్ అశ్విన్ తన రోజువారీ జీవితంలో ఉపయోగించే కారు మహీంద్రా ఈ2ఓ ప్లస్ (Mahindra e2o Plus). ఇది ఒక సబ్-కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వాహనం. ఈ కారు ధర రూ. 10 లక్షల లోపే ఉంటుంది. అసలు కల్కి లాంటి సినిమా తీసిన డైరెక్టర్ ఇలాంటి కార్ వాడుతున్నాడా? అది కూడా తనే స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటాడా? అని నెటిజన్స్ ఆశ్చర్యపోయేలా చేస్తుంటాడు నాగి. ఇక ఇప్పుడు మారుతి 800లో కనిపించి.. ఔరా అనిపించాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్లపై ఎల్లో కలర్ మారుతీ 800 కారు(Maruti 800 Car)లో తనే డ్రైవింగ్ చేస్తు కనిపించాడు నాగి. ఆయనను గమనించిన ఓ నెటిజన్.. వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్‌గా మారింది. సదరు వీడియో తీసిన వ్యక్తినే కాదు.. ఇది చూసిన నెటిజన్స్ కూడా నాగ్ అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంత సింపుల్‌గా ఎలా సాధ్యం .. వెయ్యి కోట్ల డైరెక్టర్ అని మరిచిపోయావా? అని కామెంట్స్ చేస్తున్నారు.
చేసింది మూడే సినిమాలు!
న్యాచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ నటించిన ‘ఎవడే సుబ్రహ్యణ్యం’ సినిమాతో దర్శకుడిగా మారిన నాగ్ అశ్విన్.. ఆ తర్వాత ‘మహానటి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా దివంగత నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందింది. కీర్తి సురేష్ సావిత్రిగా నటించగా, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ వంటి నటీనటులు సహాయ పాత్రల్లో నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద రూ. 80 కోట్లకు పైగా వసూలు చేసి విజయం సాధించింది. జాతీయ స్థాయిలో మూడు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గెలుచుకుంది. ఆ తర్వాత నిర్మాతగా ‘జాతిరత్నాలు’ సినిమా చేశాడు. నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టాలీవుడ్ జాతిరత్నంలా నిలిచింది. ఇక ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు నాగి. బడ్జెట్ రూ. 600 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. 1200 కోట్లకు పైగా వసూలు చేసి ప్రభాస్‌కు మరో వెయ్యి కోట్ల సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీతో పాటు ప్రభాస్‌ను నాగ్ అశ్విన్ హ్యాండిల్ చేసిన విధానానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. నెక్స్ట్ కల్కి2తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు నాగ్ అశ్విన్.