పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి నటిగా ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘గాంధీ తాత చెట్టు’. ఈ సినిమాకి ప్రమోషన్ ఎక్కువగా జరగడానికి కారణం ఆమెనే. మరి సినిమాలో ఆమె ఎలాంటి నటన కనపరిచింది. అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను గాంధేయవాది.తన తండ్రి స్పూర్తితో దేశభక్తి ఎక్కువగా పెంచుకుంటాడు. తనలానే తన కొడుకు కూతురు మనవరాలుకి కూడా గాంధీ (సుకృతి వేణి) అని నామకరణం చేస్తాడు. రామచంద్రయ్య మాదిరే గాంధీ కూడా సత్య మార్గంలో నడుస్తూ దేశభక్తి పెంచుకుంటుంది. ఇదిలా ఉంటే.. రామచంద్రయ్యకు 15 ఎకరాల భుమి ఉంటుంది. అక్కడే ఒక వేప చెట్టు కూడా ఉంటుంది. అదంటే అతనికి చాలా ఇష్టం. మరోపక్క రాజకీయ నాయకులూ చేసిన కుట్ర వల్ల ఆ ఊర్లో ఉన్న చెరకు ఫ్యాక్టరీ మూత పడుతుంది. దీంతో చెరుకు పండించిన రైతులు నష్టాలు పాలవుతారు. మరోపక్క కెమికల్ ఫ్యాక్టరీ పెట్టి ఉపాధి ఇస్తానని వ్యాపారవేత్త సతీష్(రాగ్ మయూర్) రైతులను నమ్మించి మోసం చేయాలని చూస్తుంటాడు. దీంతో అంతా తమ పొలాలు అమ్మేయడానికి సిద్ధమవుతారు. కానీ రామచంద్రయ్య మాత్రం తన భూమిని అమ్మెందుకు ఒప్పుకోడు. పొలం పోయినా వేప చెట్టుని ఎక్కడ కొట్టేస్తారో అనేది అతను భయం.అందుకోసం తన కొడుకుతో గొడవపడతాడు. ఈ క్రమంలో గాంధీ తన తాతకి అండగా నిలబడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ఈ సినిమా ప్రమోషన్స్ లో నిర్మాత ‘మైత్రి’ రవిశంకర్ ఒక మాట అన్నాడు. ‘పుష్ప 2’ లో హీరో నెగిటివ్ రోల్, స్మగ్లర్ అన్నారు కదా..? ‘గాంధీ తాత చెట్టు’ అనేది మంచి సినిమా’ ఈ సినిమాని ఆదరించండి మరి’ అని అన్నాడు. అతని మాట ముమ్మాటికీ కరెక్ట్. ఇది సామాజిక స్ప్రుహ ఉన్న సినిమా. దేశభక్తి, మొక్కల్ని పెంచడం, చెట్టుని కాపాడుకోవడానికి ఓ పాప ఎదురుతిరగడం.. ఇలాంటి మంచి విషయాలు అందరికీ కనెక్ట్ అవుతాయి అని చెప్పలేం. కానీ దర్శకురాలు పద్మావతి మల్లాది.. రాసుకున్న ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే మాటని ఆణువణువూ గుర్తు చేస్తూ కథని నడిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం బాగా కుదిరింది. సినిమా ఫస్ట్ హాఫ్.. పెద్దగా ల్యాగ్ లేకుండా మెయిన్ పాయింట్ కి తీసుకువెళ్లిన విధానం బాగుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా బాగా కుదిరింది. సెకండాఫ్ లో కూడా తాను చెప్పాలనుకున్న పాయింట్ ను దర్శకురాలు చెప్పగలిగింది. కొన్ని డైలోగ్స్ కూడా బాగా పేలాయి. అయితే ముందుగా చెప్పుకున్నట్టు ఇది.. ఎంటర్టైన్ చేసే సినిమా కాదు. ఆలోచింప చేసే సినిమా.
నటీనటుల విషయానికి వస్తే.. ముందుగా కథ మొత్తం రామచంద్రయ్య అనే పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్ర చేసిన చేసిన ఆనంద్ చక్రపాణికి ఎక్కువ మార్కులు పడతాయి. అతనితో సమానంగానే సుకృతి వేణికి కూడా మంచి మార్కులు పడతాయి. ఇంత చిన్న వయసులో ఆమె అంత చక్కగా నటిస్తుంది అని ఎవ్వరూ ఊహించలేరు. ఒకవేళ ఊహించినా అంతకంటే గొప్పగానే నటించింది ఆ పాప. ‘కీడా కోలా’ ఫేమ్ రాగ్ మయూర్ కి కూడా మంచి పాత్ర దొరికింది. తన సహజమైన నటనతో అతను కూడా మంచి మార్కులు వేయించుకుంటాడు. రఘురామ్, భాను ప్రకాష్ కూడా బాగా నటించారు.
ప్లస్ పాయింట్స్ :
కథ
డైరెక్షన్
సుకృతి వేణి నటన
సినిమా రన్ టైం 2 గంటల లోపే ఉండటం
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా స్లోగా అనిపించడం
ఫైనల్ గా ‘గాంధీ తాత చెట్టు’ మంచి సినిమా. బోలెడన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ పొందింది. కచ్చితంగా ఇండస్ట్రీ నుండి కూడా మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తుందా? అంటే కచ్చితంగా చెప్పలేం.
Gandhi Thatha Chettu Movie Review and Raing : 2.75/5