Gal Gadot: తెరపై ఎన్నో పాత్రల్లో ప్రేక్షకులను నవ్వుతూ, నవ్విస్తూ, ఎంటర్‌టైన్ చేసే హీరోహీరోయిన్ల జీవితాల్లో ఎన్నో విషాదాలు ఉంటాయి. అవన్నీ చాలావరకు ప్రేక్షకులకు తెలియదు. వారు చేసిన ప్రాతలతోనే ఆడియన్స్ ఎంటర్‌టైన్ అవుతారు కానీ వారి పర్సనల్ లైఫ్‌లోని సమస్యల గురించి పెద్దగా పట్టించుకోరు. అదే సమయంలో తెరపై వండర్ ఉమెన్‌గా కనిపించి ఎంతోమందిని తన ఫ్యాన్స్‌గా మార్చుకున్న గాల్ గాడోట్ (Gal Gadot) జీవితంలోని అతిపెద్ద విషాదం గురించి తాజాగా తనే స్వయంగా బయటపెట్టింది. దీంతో ఇది తెలుసుకున్న అభిమానులంతా తను తెరపై మాత్రమే కాదు.. తెర వెనుక కూడా వండర్ ఉమెన్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
బ్లడ్ క్లాట్
‘సోషల్ మీడియాలో మనం షేర్ చేసుకునే అందమైన సందర్భాల అడ్డుతెర వెనుక రియాలిటీ అనే ఒక సెన్సిటివ్ విషయం ఉంటుందని చెప్పాలనుకుంటున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా ఇది షేర్ చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యతో బాధపడుతున్నవారికి సపోర్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఫిబ్రవరీలో నా 8వ నెల ప్రెగ్నెన్సీలో నా బ్రేయిన్‌లో బ్లడ్ క్లాట్ అయ్యింది. చాలా వారాల వరకు నేను కనీసం బెడ్ మీద నుండి లేవలేనంత తలనొప్పి వచ్చింది. ఎమ్మారై చేయించుకున్న తర్వాత అసలు విషయం బయటపడింది. ఆ క్షణం జీవితం అనేది ఎంత సున్నితంగా ఉంటుందని నాకు, నా కుటుంబానికి అర్థమయ్యింది. ఒక క్షణంలో ఏదైనా మారిపోవచ్చు అనేదానికి నిదర్శనం అనిపించింది. ఇంత కష్టమైన సందర్భంలో నేను ఆశతో బ్రతకాలని అనుకున్నాను’ అని బయటపెట్టింది గాల్ గాడోట్.
డాక్టర్లకు థాంక్యూ
‘మేము ఆసుపత్రికి పరుగులు తీశాం. గంటల్లోనే నాకు సర్జరీ జరిగింది. అంత భయంలోనే నాకు నా కూతురు ఓరీ పుట్టింది. తన పేరుకు అర్థం నా వెలుగు. అది మేము కావాలనే ఎంపిక చేశాం. నా కూతురు వచ్చిన తర్వాత తనే నా జీవితంలో వెలుగు అవుతుందని నేను నా భర్తకు కూడా చెప్పాను’ అని గుర్తుచేసుకుంది గాల్ గాడోట్. అంతే కాకుండా తన సర్జరీని సక్సెస్‌ఫుల్ చేసినందుకు డాక్టర్స్ అందరికీ పేరుపేరునా థాంక్యూ చెప్పుకుంది. ఈ ప్రయాణం తనకు చాలా నేర్పిందని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం మంచిది కాదని తెలిపింది. మన శరీరంలో వచ్చే చిన్న చిన్న నొప్పులు కూడా ఎందుకు వస్తున్నాయో ఎప్పటికప్పుడు కనుక్కోమని సలహా ఇచ్చింది.
భయపెట్టడానికి కాదు
‘మరొకటి ఏంటంటే.. అవగాహన అనేది చాలా ముఖ్యం. చాలామంది ప్రెగ్నెంట్ మహిళల్లో బ్లడ్ క్లాట్ అనేది సహజం. ముందుగానే ఈ సమస్యను కనుక్కుంటే వెంటనే ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇది షేర్ చేసుకోవడం వల్ల నేను ఎవ్వరినీ భయపెట్టాలని అనుకోవడం లేదు. అవగాహన మాత్రమే ఇవ్వాలని అనుకుంటున్నాను. జన్మనివ్వడం అనేది ఒక అద్భుతం. కానీ దాని తర్వాత అది మన నుండి చాలా డిమాండ్ చేస్తుంది. నా కోరిక ఒక్కటే.. మనమంతా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయని నమ్ముతూ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకరికొకరు సాయంగా ముందుకు సాగిపోవాలి’ అని వివరించింది గాల్ గాడోట్.