
Gautham Menon : స్టార్ మూవీ మేకర్ గౌతమ్ మీనన్.. తిరిగి మళ్లీ డైరెక్టర్ గా యాక్టివ్ మోడ్ లోకి వస్తున్నట్లు కనిపిస్తుంది. గౌతమ్ తెరకెక్కించిన ధృవ నక్షత్రం మూవీ నవంబర్ 24న ప్రేక్షకుల ముందు రాబోతున్న విషయం తెలిసిందే. తెలియని కారణాల వల్ల ఈ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా గౌతం తాను చేయబోయే నెక్స్ట్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ప్రకటించారు. క్రికెట్ నేపథ్యంలో స్టోరీ తీస్తానంటూ గౌతం చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన నిన్నటి ఐసీసీ వరల్డ్ కప్ వన్డే టోర్నమెంట్ లో ధృవ నక్షత్రం మూవీ ప్రమోషన్ లో భాగంగా తమిళ్ కామెంటరీ లో గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెక్స్ట్ స్టోరీ గురించి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా గౌతమ్ తన నెక్స్ట్ మూవీ కథ ఏమిటో వినిపించారు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టమైన ఇద్దరు స్నేహితుల కథ ను.. ఇండియన్ లెజెండరీ ప్లేయర్స్..సచిన్-కాంబ్లి స్ఫూర్తితో తెరకెక్కిస్తాను అని మీనన్ అన్నారు.
ఇప్పటివరకు మాంచి డెప్త్ ఉన్న ప్రేమకథా చిత్రాలతో ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఎంతో న్యాచురల్ గా ఉండే లవ్ స్టోరీస్ చేసి యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు ఇంతవరకు తాను చేయని జానర్ లోకి అడుగుపెడుతున్నారు. అయితే మీనన్ తన సినిమాల్లో క్రికెట్ గురించి స్ట్రాంగ్ కంటెంట్ అక్కడక్కడ ఇస్తూనే వచ్చాడు. ప్రస్తుతం యాక్టర్ గా కూడా బిజీ అయిన మీనన్ ఇకపై ఫుల్ కాన్సన్ట్రేషన్ తన స్క్రిప్ట్ పైన పెడతారట. అంటే కొంతకాలం అతను నటనకు దూరమయ్యే ఛాన్స్ కూడా ఉంది. స్టోరీ దగ్గర నుంచి మొత్తం స్వయంగా మీననే సిద్ధం చేసుకుంటాను అంటున్నాడు కాబట్టి మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
ఇక మీనన్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన మూవీ ధృవ నక్షత్రం . ఏడు సంవత్సరాల నుంచి వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నవంబర్ 24న
‘ధృవ నక్షత్రం చాప్టర్ 1 – యుద్ధకాండం’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన ట్రైలర్ బాగా ఆకట్టుకుంది.ఈ మూవీ లో విక్రమ్,రితూ వర్మ హీరో హీరోయిన్ గా చేస్తున్నారు.సిమ్రన్, పార్తిబన్, రాధికా శరత్ కుమార్, వినాయకన్, దివ్యదర్శిని, గౌతమ్ మీనన్, ధనంజయన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో విడుదల తర్వాత తెలుస్తుంది.