God Father OTT : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హిట్ టాక్‌నే రాబట్టుకుంది. మలయాళ చిత్రం లూసిఫర్‌కి రీమేక్‌గా తెలుగులో రీమేక్ అయిన ఈ చిత్రం ఎలా ఉంటుందోనని అందరూ సందేహించిన మాటను ఎవరూ కాదనలేరు. అయితే దర్శకుడు మోహన్ రాజా … సినిమాను చక్కగా చిరంజీవి ఇమేజ్‌కి తగినట్టు తెరకెక్కించారు. ఈ పొలిటికల్ డ్రామా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయటానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తెలియజేసింది. నవంబర్ 19 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో గాడ్ ఫాదర్ అందుబాటులోకి రానుంది.
ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో చిరంజీవి చెల్లెలు పాత్రలో నయనతార నటించింది. సత్యదేవ్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో అలరించారు. ఇక తమన్ తనదైన సంగీతం, బీజీఎంతో ఆకట్టుకున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే.. బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇందులో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రం తెలుగు వెర్షన్ ఓటీటీలో ఉంది. కాగా.. గాడ్ ఫాదర్ తెలుగు వెర్షన్ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందనేది అందిరలోనూ ఆసక్తిని పెంచుతోన్న విషయం.