Hansika:హన్సిక మొత్వాని ఉత్తరాది అమ్మాయి అయినప్పటికీ తెలుగు, తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. మరీ ముఖ్యంగా చెన్నైలో సొంత ఇల్లు కొనుగోలు చేసి అక్కడే స్థిరపడింది కూడా. ఈ మధ్యనే ఆమె తన మనసుకి నచ్చిన వ్యక్తి సోహైల్ కథూరియాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకను వాళ్లు షూట్ చేసి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్‌స్టార్‌కు ఇచ్చారు. అందులో లవ్ షాదీ డ్రామా పేరు హన్సిక – సోహైల్ పెళ్లి వేడుక స్ట్రీమింగ్ అవుతుంది. అందులో ఆమె పలు విషయాలపై ఓపెన్‌గానే మన మనసులోని మాటలను తెలియజేసింది. అందులో భాగంగా కెరీర్ ప్రారంభంలో ఆమె ఫేస్ చేసిన విమర్శలపై స్పందించింది.
ఇంతకీ హన్సిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తొలి రోజుల్లో ఏ విషయంపై విమర్శలు ఎదుర్కొందనే వివరాల్లోకి వెళితే.. హీరోయిన్ కావటానికి ముందే కోయి మిల్ గయా సహా రెండు, మూడు హిందీ ప్రాజెక్ట్స్‌లో హన్సిక బాలనటిగా మెప్పించింది. దేశ ముదురు చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఆ క్రమంలో ఆమెను చూసిన వారు నిన్నా మొన్నటి వరకు చిన్న పాపలా ఉన్న హన్సిక ఇంత పెద్ద అమ్మాయిగా ఎలా మారిందని ప్రశ్నలు వేశారు. కొందరైతే ఆమె హార్మోన్స్ సంబంధిత ఇంజెక్షన్స్ తీసుకుందని అన్నారు. కొందరు వాటిని రాశారు.
అప్పట్లో హన్సిక కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఈ వార్తలపై స్పందించలేదు. అయితే లవ్ షాదీ డ్రామాలో హన్సిక తనపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇచ్చింది. ‘‘నేను 21 ఏళ్లలోనే విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నాను. అందుకు కారణం నేను సెలబ్రిటీ కావటమే. నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో అందరికీ తెలుసు. నేను ప్రారంభంలోనే వాటిని తీసుకుని ఉండుంటే, ఇప్పటికీ వాటిని తీసుకుంటూ ఉండాల్సి వచ్చుండేది. నేను పెద్దదానిలా కనిపించాలని నా తల్లిదండ్రులు హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చారని రాశారు. ఇలాంటి వార్తలను ఎవరు క్రియేట్ చేస్తారో తెలియదు. మేం పంజాబీలం. మాలో 12 ఏళ్ల నుంచి 16 ఏళ్లలో ఆడ పిల్లలు త్వరగా ఎదుగుతారు’’ అని అన్నారు హన్సిక.