Movie Ticket Price: మామూలుగా ప్రతీ పండగకు థియేటర్లలో సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. కానీ ఈ న్యూ ఇయర్‌కు మాత్రం థియేటర్లలో అంతగా సందడి కనిపించడం లేదు. డిసెంబర్ రెండో వారంలో రెండు సినిమాలు మాత్రమే హైప్ మధ్య థియేటర్లలో విడుదలవుతున్నాయి. అందులో ఒకటి స్ట్రెయిట్ తెలుగు సినిమా కాగా.. మరొకటి తమిళ డబ్బింగ్ చిత్రం. ఏయే సినిమాలు విడుదల అవుతున్నాయని కాకుండా.. ఆ సినిమాల టికెట్ ధరలు ఎంత ఉన్నాయి అనే విషయంపై చర్చ సాగుతోంది. ‘పుష్ప 2’ మూవీకి ఒక రేంజ్‌లో టికెట్ ధరలు చూశారు ప్రేక్షకులు. అందుకే ఈ వారం విడుదల కానున్న చిత్రాల టికెట్ ధరలు హాట్ టాపిక్‌గా మారాయి.
నరేశ్ మాస్ యాక్షన్
ఒకప్పుడు అల్లరి నరేశ్ అంటే కేవలం కామెడి హీరో మాత్రమే. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. చాలామంది ఇతర హీరోలలాగా నరేశ్ కూడా వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. అంతే కాకుండా నటుడిగా కూడా కొత్త కథలను ఎంచుకోవడానికే ఇష్టపడుతున్నాడు. అదే విధంగా మొదటిసారి అల్లరి నరేశ్ ఊరమాస్ లుక్‌తో ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. అదే ‘బచ్చలమల్లి’. ఈ మూవీ డిసెంబర్ 20న థియేటర్లలో సందడి చేయడానికి వచ్చేస్తుంది. దీంతో పాటు విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘విడుదల 2’ కూడా అదే రోజు విడుదల కానుంది.
Also Read: అల్లు అర్జున్ అబద్ధాలు.? శ్రీ తేజ్ హాస్పిటల్ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది
అతితక్కువ ధరలు
‘బచ్చలమల్లి’ (Bachchala Malli)తో పాటు ‘విడుదల 2’ సినిమా కూడా ఒకేసారి థియేటర్లలో పోటీకి దిగనున్నాయి. విడుదల తేదీ విషయంలోనే కాదు.. టికెట్ రేట్ల విషయంలో కూడా ఈ సినిమాలు పోటీ పడుతున్నాయి. మల్టీ ప్లెక్స్‌ల్లో ఈ సినిమాల టికెట్ ధరలు రూ.180 కాగా సింగిల్ స్క్రీన్స్‌లో ఈ ధర రూ.150 అని నిర్ణయించారు మేకర్స్. ఇదే విషయాన్ని తాజాగా రెండు సినిమాల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ఫ 2’ సినిమాకు విపరీతంగా రేట్లు పెంచేశారు. అందుకే ఈ రెండు సినిమాల టికెట్ ధరలు చూస్తుంటే రెండు చిత్రాలను ఒకేరోజు కవర్ చేయవచ్చని అనుకుంటున్నారు.
తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు
‘విడుదల 2’ (Vidudhala 2) సినిమా డబ్బింగే అయినా తెలుగు ప్రేక్షకులు కూడా దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్నాళ్ల క్రితం విడుదలయిన ‘విడుదల పార్ట్ 1’ ఏ అంచనాలు లేకుండా వచ్చి అటు తమిళ, ఇటు తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అందులో విజయ్ సేతుపతి కేవలం క్యామియోలో మాత్రమే కనిపించాడు. కానీ సీక్వెల్‌లో అసలు విజయ్ సేతుపతి కథేంటి అని చూపించబోతున్నారు. అందుకే తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు సైతం ‘విడుదల 2’ బాగుంటుందని ఫిక్స్ అయిపోతున్నారు. ముఖ్యంగా తగ్గిన టికెట్ ధరలు కూడా మూవీ లవర్స్ ఈ రెండు సినిమాలు చూడడానికి మోటివేట్ చేస్తున్నాయి. మరి ఈ రెండిటిలో బాక్సాఫీస్ విన్నర్‌గా ఏది నిలుస్తుందో చూడాలి.