Sunil Pal Kidnapping Case : సునీల్ పాల్ (Sunil Pal) కిడ్నాప్ కేసు కొత్త మలుపు తిరిగింది. తాజా అప్‌డేట్ ప్రకారం స్టాండప్ కమెడియన్, నటుడు సునీల్ పాల్ కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న ఐదుగురు నిందితులను పట్టుకుంటే నగదును బహుమతిగా ఇస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రకటించారు.
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విపిన్ టాడా మీడియాతో ఈ మేరకు ఐదుగురు నిందితుల గుర్తింపు సమాచారాన్ని పంచుకున్నారు. పరారీలో ఉన్న వ్యక్తులు లవి పాల్ అలియాస్ సుశాంత్ అలియాస్ హిమాన్షు, ఆకాష్ అలియాస్ గోలా అలియాస్ దీపేంద్ర, శివ, అంకిత్ అలియాస్ పహాడీ, శుభం అని చెప్పారు. పరారీలో ఉన్న ఈ ఐదుగురినీ వాంటెడ్‌గా ప్రకటించారు. వాళ్ళను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా సునీల్ పాల్ (Sunil Pal) కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న ఐదుగురు నిందితులపై పోలీసులు ఒక్కొక్కరిపై రూ.25,000 రివార్డు ప్రకటించారు.
అసలేం జరిగిందంటే… స్టాండప్ కమెడియన్, నటుడు సునీల్ పాల్ (Sunil Pal) డిసెంబర్ 2న కిడ్నాప్ కు గురయ్యారు. ఒక కార్యక్రమంలో పర్ఫామ్ చేయాలని ఆయనను ఆహ్వానించి, అనంతరం కిడ్నాప్ చేశారు నిందితులు. దాదాపు 24 గంటలపాటు అతడిని బందీగా ఉంచి, ఆపై కిడ్నాపర్లు రూ. 8 లక్షలు ఇస్తేనే రిలీజ్ చేస్తామని డిమాండ్ చేశారు. సునీల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత అతన్ని కిడ్నాపర్లు విడుదల చేశారు. సునీల్ కిడ్నాపర్ల నుంచి బయటపడ్డ తర్వాత ఆయన భార్య సరిత ముంబైలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనంతరం ఈ కంప్లయింట్ మీరట్ లోని లాల్ కుర్తి పోలీస్ స్టేషన్‌కు బదిలీ కావడం, స్థానిక పోలీసులు దర్యాప్తు చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి.
అయితే ఇలా ఈవెంట్ సాకుతో ఒక సెలబ్రిటీ అరెస్ట్ కావడం ఇదే మొదటిసారి కాదు. అచ్చం ఇలాగే పలువురు సెలబ్రిటీలు కిడ్నాప్ కావడం కలకలం రేపింది. బాలీవుడ్ నటుడు ముస్తాక్ ఖాన్ కూడా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో కిడ్నాప్ అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కార్యక్రమానికి ఆహ్వానించి, ఆ తరువాత ముస్తాక్ ఖాన్ ను కిడ్నాప్ చేసేందుకు దుండగులు ప్లాన్ చేశారు. కిడ్నాప్ చేసి అతన్ని ఓ ప్రదేశంలో బందీగా ఉంచగా, ఆయన చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుని, ప్రాణాలతో బయట పడ్డాడు.
అచ్చం ఇలాగే మరికొంత మంది సెలబ్రిటీల కిడ్నాప్ కు ప్లాన్ జరుగుతున్నట్టుగా సమాచారం అందడంతో పోలీసులు ఇప్పుడు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే సునీల్ ను కిడ్నాప్ చేసి, పరారీలో ఉన్న వాళ్ళను పట్టిస్తే నగదు బహుమానం ప్రకటించారు. ఒక్కో నిందితుడిపై ఏకంగా రూ. 25,000 రివార్డు ఉంది ఇప్పుడు. దీంతో మరో సెలబ్రిటీ కిడ్నాప్ కాకముందే పోలీసులు ఆ నిందితులను పట్టుకుని శిక్షించాలని కోరుకుంటున్నారు. మరి ఇప్పటికైనా పోలీసులు నిందితులను పోలీసులు పట్టుకోగలుగుతారా? అన్నది చూడాలి. ఏదేమైనా సెలబ్రిటీలకు ఈ గ్యాంగ్ భయంతో చెమటలు పట్టిస్తోంది.